కళాసేవకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

కళాసేవకు గ్రహణం

Oct 6 2026 2:06 AM | Updated on Oct 6 2026 2:06 AM

కళాసేవకు గ్రహణం

కళా ప్రదర్శనల బిల్లుల మంజూరులో తీవ్రజాప్యం కూటమి నేతల సేవలో తరిస్తున్న సాంస్కృతిక శాఖాధికారులు నచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్న వైనం ఉద్యోగ విరమణ చేసినా మంత్రి అండతో కొనసాగుతున్న సీఈవో

విజయవాడ కల్చరల్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాకారులను పట్టించుకోవడం మానేసింది. కళాకారుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, సృజనాత్మక సమితి కూటమి నాయకుల సేవలో తరిస్తోంది. నెలల తరబడి కళాకారుల కళాప్రదర్శనకు ఇవ్వాల్సిన పైకం కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నా సంబంధిత శాఖ ఉద్యోగులు పట్టించుకోవడంలేదు. దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో పనిచేస్తున్న ఆ శాఖ అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణలున్నాయి.

నచ్చిన వారికే నిధులా..

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కళాసంస్థలు రెండేళ్లుగా వందలాది కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులకు అండగా ఉంటున్నాయి. భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వారికి బిల్లులు మంజూరు చేయడంతో తీవ్ర జాప్యం చేస్తూ నిబంధనల పేరుతో వారిని కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిప్పించుకుంటున్నారు. సాంస్కృతిక శాఖకు సంబంధిన అధికారులు కూటమి నాయకుల రికమండేషన్‌తో బిల్లులు త్వరగా చెల్లిస్తున్నారు. కొందరికి మీ సంస్థ రిజిస్టర్‌ కాలేదు. బిల్లు చెల్లించడం కుదరని కుంటి సాకులు చెబుతున్నారు. నిజానికి రిజిస్టర్‌ కాని సంస్థలకు బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఉద్యోగం ఇక్కడ.. ఉండేది అక్కడ..

భాషా సాంస్కృతిక శాఖలో పనిచేసే సీఈవో నిత్యం కార్యాలయంలో అందుబాటులో ఉండటంలేదు. సచివాలయంలో మంత్రి చాంబర్‌లో కాలం గడిపేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసినా సాంస్కృతిక శాఖా మంత్రి అండతో సీఈవోగా కొనసాగుతున్నారు. కూటమికి డప్పుకొడుతున్న ఓ పత్రిక విలేకరి కార్యాలయంలో తిష్ట వేసి తనకు అనుకూలమైన వారికి బిల్లులు త్వరగా వచ్చేలా ఒత్తిడి తెస్తున్నారు.

పురస్కారాల చంద్రజాలం..

ప్రభుత్వం ఏటా ప్రకటించే ఉగాది, కందుకూరి, గురజాడ, బోయి భీమన్న, జాషువా పురస్కారాల ఎంపికలోనూ పారదర్శకత లోపించింది. మంత్రులు, శాసన సభ్యుల సిఫార్సుతో అర్హత లేని వారికి పురస్కారాలు ఇచ్చేస్తున్నారు. సాంస్కృతిక శాఖకు సంబంధించిన అంశాల కోసం ఆర్టీఐ కార్యకర్తలు ఎవరైనా సమాచారం కోరితే నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. రెండేళ్లుగా సాంస్కృతిక శాఖకు మంజూరైన నిధులు ఎంత, దేనికి ఎంత ఖర్చుపెట్టారు వంటి అంశాలపై న్యాయవిచారణ జరిగితే.. కలుగులోని ఎలుకలు బయటకు వచ్చే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement