దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్‌

Oct 6 2026 2:06 AM | Updated on Oct 6 2026 2:06 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ సోమవారం పరిశీలించారు. తొలుత ఘాట్‌రోడ్డుకు చేరుకున్న కమిషనర్‌ కొండ రాళ్లు విరిగి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి ఆదివారం నుంచే ప్రారంభమయ్యే ఉత్సవాలకు రెండు రోజుల ముందుగానే పనులు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని నూతన పూజా మండపాన్ని పరిశీలించారు. ఉత్సవాల్లో అమ్మవారికి జరిగే ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, కుంకుమార్చనకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పనులు సకాలంలో పూర్తి కావాలి..

ఆలయ మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలించిన కమిషనర్‌ ఉత్సవాలలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మల్లేశ్వరస్వామి వారి ఆలయం వద్ద కొండ దిగువకు చేరుకునే మెట్ల మార్గాన్ని పరిశీలించారు. భక్తుల రద్దీ అధికమైనప్పుడు ఎటువంటి తోపులాట జరగకుండా చూడాలని, అందుకు ముందుగానే బ్యారికేడ్లు, రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేవస్థానం నూతనంగా నిర్మించిన లడ్డూపోటును పరిశీలించిన కమిషనర్‌ పలు సూచనలు చేశారు. ఉత్సవాలకు సుమారు 25 లక్షల మంది భక్తులు విచ్చేస్తారనే అంచనాలు ఉన్నాయని, చేపట్టిన అన్ని ఇంజినీరింగ్‌ పనులు సకాలంలో పూర్తి కావాలని ఆదేశించారు. భక్తుల భద్రత, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సృష్టం చేశారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవో శీనానాయక్‌, ఈఈ ఎల్‌.రమా, ఇంజినీరింగ్‌ అధికారులు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement