లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి 103 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి, ఏసీపీ వెంకటేశ్వరరావు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకుని, సంబంధిత స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో భూ, ఆస్తి వివాదాలకు సంబంధించి 30, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 8, వివిధ మోసాలపై 20, మహిళా సంబంధిత నేరాలపై 11, కొట్లాటలపై 1, దొంగతనాలపై 3, ఇతర వివిధ సమస్యలపై 30 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న మహిళా ఎస్‌ఐ, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేసిన ఇద్దరు యువకులను భవానీపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. సేకరించిన వివరాల ప్రకారం ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణాజిల్లాలోని ఓ ఊరు వెళ్లిన మహిళా ఎస్‌ఐ తిరుగు ప్రయాణంలో విజయవాడ గొల్లపూడి బైపాస్ రోడ్ మీదుగా వస్తుండగా జోజినగర్ సెంటర్‌లో మద్యం, గంజాయి మత్తులో ఉన్న కొంతమంది ఆకతాయిలు వారి కారును వెంబడించి వేధించినట్లు తెలిసింది. దీంతో ఆమె భవానీపురం పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి వచ్చి ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వారిని స్టేషన్ బెయిల్‌పై పంపించినట్లు తెలిసింది. అయితే భవానీపురం పీఎస్ రైటర్‌కు ఫోన్ చేసి వివరాలు అడగగా బాధితులు వచ్చి ఫిర్యాదు చేయనందున ఎఫ్‌ఐఆర్ కట్టలేదని చెప్పారు. సీఐ ఫోన్‌కు స్పందించ లేదు. సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ కేసు గురించి మీడియాకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం వెనుక లోగుట్టు పోలీసులకే తెలియాలి.
హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా సన్నిధి నాగసాయి శ్రీనివాస్
మచిలీపట్నంఅర్బన్: హాకీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సన్నిధి నాగసాయి శ్రీనివాస్ హాకీ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన హాకీ ఆంధ్రప్రదేశ్ 12వ వార్షిక జనరల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం మార్పులు, చేర్పులు సందర్భంగా సన్నిధి నాగసాయి శ్రీనివాస్‌కు ఉపాధ్యక్ష పదవి దక్కింది. జిల్లాలో హాకీ అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం పట్ల హాకీ క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.


