లబ్బీపేట(విజయవాడతూర్పు): బాలల న్యాయవ్యవస్థ చట్టం నియమాలను అవగాహన కలిగించేలా ముద్రించిన పోస్టర్‌ను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు సోమవారం ఆవిష్కరించారు. పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్‌లో పిల్లల సంరక్షణ, రక్షణ చట్టం 2000, నియమాలు 2003 పొందుపర్చినట్లు తెలిపారు. 18 ఏళ్ల లోపు ఉన్న బాలబాలికల (జువైనెల్స్) కేసుల్లో పోలీస్ అధికారులు వ్యవహరించాల్సిన తీరు, పాటించాల్సిన నియమ నిబంధనలపై అధికారులు, సిబ్బంది స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రాజెక్ట్ రెస్క్యూ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులకు మంగళవారం జూమ్ మీటింగ్ ద్వారా ‘బాలల న్యాయవ్యవస్థ – పిల్లల సంరక్షణ, రక్షణ చట్టం 2000, నియమాలు 2003‘ పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. పిల్లల హక్కుల పరిరక్షణకు, వారికి సరైన న్యాయం, పునరావాసం కల్పించడానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు. ఏదైనా అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం 100 లేదా చైల్డ్ లైన్ 1098 కు కాల్ చేయాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో డీసీపీ సరిత, ప్రాజెక్ట్ రెస్క్యూ ఫౌండేషన్ డాక్టర్ మాథ్యూస్ కె డానియల్ పాల్గొన్నారు.


