గన్నవరం: మండలంలోని వెదురుపావులూరు వద్ద వెస్ట్ బైపాస్‌పై టోల్‌గేట్ వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చెందినవిగా చెబుతున్న టిప్పర్ డ్రైవర్లు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. టోల్‌ఫీజు చెల్లించకుండా ఆదివారం టిప్పర్ డ్రైవర్లు టోల్‌ప్లాజా వద్ద హైడ్రామా సృష్టించిన విషయం తెలిసిందే. టోల్‌ప్లాజా సిబ్బందితో గొడవకు దిగడంతో పాటు టోల్‌గేట్లకు అడ్డంగా టిప్పర్లు పెట్టి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఈ ఘటనలో 10 టిప్పర్లు టోల్‌గేట్‌ను ఢీకొట్టుకుని వెళ్లిపోగా, మరో ఎనిమిది టిప్పర్లను పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకుని పక్కన పెట్టించారు. రాత్రంతా టోల్‌ప్లాజ్ వద్దే ఉంచిన టిప్పర్లను సోమవారం తెల్లవారుజామున దెందులూరు వైపు వెనక్కి తీసుకువెళ్లారు.
వివాదస్పదమైన టిప్పర్ల డ్రైవర్ల వైఖరి..
వెదురుపావులూరు టోల్‌ప్లాజా వద్ద టిప్పర్ డ్రైవర్లు వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన టిప్పర్లు కావడంతో టోల్‌ఫీజు కట్టమంటూ సిబ్బందిపై గొడవకు దిగడంతో పాటు రౌడీయిజం చేయడం పట్ల పలువురు ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే వాహనానికి టోల్ మినహాయింపు ఉంటుంది కానీ, కమర్షియల్ టిప్పర్ లారీలకు టోల్ ఫ్రీ కట్టనంటే ఎట్లా అన్ని ప్రశ్నిస్తున్నారు. టిప్పర్లను టోల్‌ప్లాజాకు అడ్డంగా పెట్టి రోడ్డును బ్లాక్ చేయడం, కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ను స్తంభింపజేసి వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని ప్రజలు నిలదీస్తున్నారు. సదరు ఎమ్మెల్యే టిప్పర్ డ్రైవర్లు పోలీసులపై వ్యవహరించిన తీరును కూడా తప్పుబడుతున్నారు. పోలీస్ అధికారులు అడిగితే టిప్పర్ డ్రైవర్లు సరైన సమాధానం చెప్పకపోవడం, వాహన రికార్డులు, పర్మిట్లు చూపకపోవడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు టోల్‌ప్లాజా వద్ద వీరంగం సృష్టించిన టిప్పర్ డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం కళాశాలల్లో మెంటార్ – మెంటీ వ్యవస్థను బలోపేతం చేయాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్, రిజిస్ట్రార్ టి.సాయిసుధీర్ పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో సోమవారం వెబినార్ నిర్వహించారు. ప్రముఖ మానసిక వైద్యులు అపర్ణ వుప్పల(అమెరికా) వైద్య విద్యార్థుల మానసిక పరిస్థితి, కళాశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెబినార్ ద్వారా ప్రిన్సిపాళ్లకు వివరించారు. వెబినార్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైద్య కళాశాలల్లో ఉండే బోధకుల సంఖ్యకు తగ్గట్టు ఒక్కొక్కరు ఆరు నుంచి ఏడుగురు విద్యార్థులకు మెంటార్–మెంటీగా వ్యవహరించాలన్నారు. ఈ వ్యవస్థ పటిష్టంగా ఉంటే సత్ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్తగా చేరే ఎంబీబీఎస్ విద్యార్థుల సంక్షేమం నిమిత్తం ప్రిన్సిపాల్స్ నేతృత్వంలో కమిటీ(మెంటల్ హెల్త్ అండ్ వెల్‌బీయింగ్)ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిందని గుర్తు చేశారు. వైద్య విద్యలోని ఒత్తిడి, అందుబాటులో ఉన్న సహాయక చర్యలు శారీరక, మానసికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు.
2023లో ప్రారంభమైన ‘ఈజ్–ఏపీ’
’2023 జనవరి 6న ‘ఈజ్–ఏపీ’ కార్యక్రమం ప్రారంభమైందని, క్యూపీఆర్ ఇనిస్టిట్యూట్ ఇండియా, సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో కార్యక్రమం అమలవుతోందన్నారు. ఆరోగ్యశాఖ, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, వైద్య విద్యాశాఖ తదితర విభాగాలు భాగస్వాములుగా ఉన్నాయన్నారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, అవసరమైనప్పుడు సహాయం కోరేలా ప్రోత్సహించడం, తోటి విద్యార్థులకు అండగా నిలిచే నైపుణ్యాలను పెంచడం, మానసిక సమస్యలపై ఉన్న అపోహలు, సంకోచాన్ని తగ్గించడం దీని లక్ష్యాలుగా తెలిపారు. ఈజ్ – ఏపీ మెడికల్ డైరెక్టర్, బాలల–కౌమార మానసిక వైద్యులు డాక్టర్ అపర్ణ వుప్పల మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఒత్తిడి, భావోద్వేగ ఇబ్బందులను ముందుగానే గుర్తించాలన్నారు. తోటి విద్యార్థిలో ఇబ్బందుల సంకేతాలు కనిపిస్తే విమర్శించకుండా మాట్లాడాలని, వారు చెప్పేది శ్రద్ధగా వినాలని తెలిపారు. అవసరమైనప్పుడు నిపుణుల సహాయం అందేలా చూడాలని సూచించారు. మానసిక సమస్యకు సహాయం కోరడం బలహీనత కాదని, విద్యార్థులు మానసిక వైద్యులను సంప్రదించేందుకు సంకోచించకూడదని చెప్పారు.


