అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌లో ఎన్టీఆర్‌ జిల్లా కీలకం | - | Sakshi
Sakshi News home page

అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌లో ఎన్టీఆర్‌ జిల్లా కీలకం

Oct 6 2026 2:06 AM | Updated on Oct 6 2026 2:06 AM

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌లో ఎన్టీఆర్‌ జిల్లా కీలక పాత్ర పోషించగలదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా దానిచుట్టూ ఉన్న జిల్లాలను అనుసంధానిస్తూ అమరావతి ఎకనామిక్‌ రీజియన్‌ పేరుతో భారీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనలో భాగంగా మేధోమథన చర్చలు, వర్క్‌షాప్‌లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని ఏవీఎస్‌ రెడ్డి హాల్‌లో ఏఈఆర్‌ ప్రణాళికపై జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌ (ఏఈఆర్‌) కీలకపాత్ర పోషించనుందని.. పారిశ్రామిక రూపురేఖలు పూర్తిగా మారనున్నాయన్నారు. సమావేశంలోఎల్‌ఈఏ అసోసియేట్స్‌ (ఏఈఆర్‌పీ) బృంద సభ్యులతో పాటు ప్రణాళిక, పరిశ్రమలు, ఏపీఐఐసీ, వ్యవసాయం, అనుబంధ రంగాలు తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.

సమగ్ర ఆర్థిక వృద్ధికి బాటలు..

ఎన్టీఆర్‌, కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో కూడిన అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లాలో సుస్థిర ఆర్థిక వృద్ధికి ఉన్న కీలక అవకాశాలపై చర్చించారు. జిల్లాలో నేచురల్‌ ఫార్మింగ్‌తో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అభివృద్ధికీ పుష్కల అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే జిల్లాలో 40 వేల మందికి పైగా ప్రకృతి సేద్యాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు. ఏడు నియోజకవర్గాల్లోనూ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు చురుగ్గా అడుగులు పడుతున్నాయన్నారు. ఐటీ, ఐటీఈఎస్‌ భవిష్యత్తు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాల వృద్ధికి మరింత చొరవ చూపాల్సిన అవసరముందని కలెక్టర్‌ లక్ష్మీశ చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిశ్రమలు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, జిల్లా దార్శనిక ప్రణాళిక, సామాజిక ఆర్థిక నివేదిక, విపత్తు నిర్వహణ ప్రణాళికపై చర్చించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, ప్రైవేటు రంగ భాగస్వామ్యం, స్థానిక వనరుల సమర్థ వినియోగం ద్వారా సుస్థిరమైన, సమగ్ర ఆర్థిక వృద్ధికి బాటలు వేయవచ్చని తద్వారా ఏఈఆర్‌లో కీలక ప్రాంతంగా జిల్లాను నిలబెట్టవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, సీపీవో వై.శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement