న్యూస్‌రీల్
పశ్చిమ కృష్ణాలో మండుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు 43.5 శాతం లోటు వర్షపాతం జలకళ కోల్పోయిన ఏర్లు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టం కరువు మండలాల ప్రకటన కోసం అన్నదాతల ఎదురుచూపు
పూత, కాయ దశలోనే పత్తి పంటకు దెబ్బ
ఆయుర్వేదంపై అవగాహన ర్యాలీ
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
7
మచిలీపట్నంటౌన్: బందరులో బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్చేంజ్ వద్ద సివిల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో 11 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శనివారం ధర్నా చేశారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నిత్యాన్నదానానికి పలువురు భక్తులు శనివారం విరాళాలు అందచేశారు. దుర్గమ్మ దర్శనానంతరం అమ్మవారి ప్రసాదాలు ఇచ్చారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బోయి భీమన్న జీవిత ఛాయా చిత్ర మాలికను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశతో కలిసి భీమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గుంటూరు జిల్లాకు చెందిన రచయిత, సాహితీవేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లుకు ’బోయి భీమన్న అవార్డు–2026’ అందజేశారు. భీమన్న సతీమణి బోయి హైమావతి, రాష్ట్ర నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలకు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్(సీఎఫ్‌వో)గా చంద్రశేఖర్ ఆజాద్‌ను ప్రభుత్వం నియమించింది. గతంలో దుర్గగుడి ఈవోగా పని చేసిన అనుభవం ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు దోహదపడతాయనే భావనతో నియమించినట్లు తెలుస్తోంది. శనివారం దుర్గగుడికి చేరుకున్న ఆజాద్ ఆలయంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎఫ్‌వోను దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ అన్నదాన భవనంలో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. ఆయన వెంట ఈవో శీనానాయక్, ఈఈ ఎల్.రమాదేవి, రాంబాబు తదితరులు ఉన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం గుర్తించిన మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ ఈ కామరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కమిటీ, కమిటీ పరిధిలోని లేని వివిధ కేటగిరీల్లో 33 బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తుది మెరిట్ జాబితాను వెబ్‌సైట్ https:krishna.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి మెరిట్ జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేటి సమాజంలో మన మూలాలను, భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వి పిలుపునిచ్చారు. నగరంలోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల సెమినార్ హాల్‌లో భారత్ వికాస్ పరిషత్ విజయవాడ మెయిన్, సెంట్రల్, ఈస్ట్ బ్రాంచిల ఆధ్వర్యంలో నిర్వహించిన బృందగాన పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందీ, సంస్కృత భాషల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆమె బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లలకు సంగీతం, ప్రాచీన భాషలైన హిందీ, సంస్కృతంలో పాటలు నేర్పిస్తే వారిలో ఏకాగ్రత, క్రమశిక్షణతో పాటు జాతీయ భావన ఎంతో పెరుగుతాయని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతేనే కళలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పోటీల విజయవాడ బ్రాంచ్ విభాగంలో సుమారు 26 పాఠశాలల నుంచి 350 మందికి పైగా విద్యార్థులు 58 జట్లుగా ఏర్పడి ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన జట్లు తర్వాత స్టేట్, సౌత్ రీజినల్, నేషనల్ స్థాయి పోటీలకు ఎంపికవుతాయని నిర్వాహకులు డాక్టర్ చుండూరు మురళీధర్ తెలిపారు. భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు, చందోలు ఆంజనేయులు, నాగేశ్వరరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విజయవాడరూరల్: ఎన్టీఆర్ జిల్లా స్థాయి నేషనల్ సైన్స్ సెమినార్–2026 విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. విజయవాడలోని సీవీఆర్‌ఎంసీహెచ్ హైస్కూల్‌లో సెమినార్ నిర్వహించారు. ఈ సంవత్సరం సెమినార్‌కు ఇండియన్ ఎనర్జీ బాస్కెట్–2047ప్రాప్సెక్ట్స్ అండ్ చాలెంజెస్ అనే అంశాన్ని నిర్ణయించారు. జిల్లాలోని 20 మండలాల్లో నిర్వహించిన మండల స్థాయి పోటీల నుంచి ప్రతి మండలం నుంచి విద్యార్థులు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌లో ప్రతిభను ప్రదర్శించారు. జిల్లా స్థాయి పోటీల్లో పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల, నున్నకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జి.మధులాస్య ప్రథమ స్థానాన్ని, జెడ్పీహెచ్‌ఎస్ గరల్స్, జగ్గయ్యపేటకు చెందిన 10వ తరగతి విద్యార్థిని సీహెచ్ అక్షయ ద్వితీయ స్థానాన్ని సాధించారు. వీరిద్దరూ రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో ఎన్టీఆర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. కార్యక్రమంలో డీఈఓ చంద్రకళ, విజయవాడ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి డి.సాంబశివరావు, హైస్కూల్ హెచ్‌ఎం ఎ.సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి కె.పిచ్చేశ్వరరావు, జ్యూరీ సభ్యులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను విజయవాడపోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ, డీఈవో కిషోర్‌కుమార్.. సీపీకి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఇచ్చారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పశ్చిమ కృష్ణా (ఎన్టీఆర్ జిల్లా)లో కరువు ఛాయలు అలముకున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వేసవిని తలపించే ఎండలతో భూములు నెర్రెలిచ్చి నోళ్లు తెరిచాయి. ఏటా వర్షాకాలంలో వరద నీటితో కళకళలాడే కట్టలేరు, వైరా ఏరు, మున్నేరు, పాలేరు, బుడమేరు వాగులు, ఏర్లు ఈసారి జలకళకు నోచుకోలేదు. వర్షాలు కురవకపోతాయా.. పంటలు దక్కకపోతాయా అన్న ఆశతో సాగు చేపట్టిన అన్నదాతలకు నిరాశే మిగిలింది.
సాగు విస్తీర్ణం తగ్గినా
తప్పని నష్టం
ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ, తిరువూరు, నందిగామ డివిజన్ల పరిధిలో ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 94,197 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 69,900 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ విస్తీర్ణంలో 74 శాతం మేర పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 35,894, పత్తి 23,013, పెసలు 5,023, మొక్కజొన్న 3,137, మినుము 2,156, కంది 349 హెక్టార్లలో సాగు చేసినట్లు అంచనా వేశారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో అధికంగా వర్షాధార సాగుపైనే రైతులు ఆధారపడుతున్నారు. ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షాలు ముఖం చాటేయడంతో సాగునీటి వనరులపై తీవ్ర ప్రభావం పడింది. ఏటిపట్టు గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు సక్రమంగా పని చేయక పోవడంతో అనేక ప్రాంతాల్లో వరి నారుమడులు వేయలేని పరిస్థితి ఏర్పడింది. సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లతో నీటిని అందించే ప్రయత్నం చేసినా, భూగర్భ జలాలు అడుగంటడంతో అవీ ఫలించలేదు.
జిల్లాలో తాగునీటి
వనరులపైనా ఆందోళన
ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు సాధారణంగా 651.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 368.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. జిల్లాలో 43.5 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని 16 గ్రామీణ, 4 పట్టణ మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న తిరువూరు డివిజన్‌లో 45.3 శాతం, నందిగామ డివిజన్‌లో 52.6 శాతం, విజయవాడ డివిజన్‌లో 33.9 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు తాగునీటి వనరులపైనా ఆందోళన నెలకొంది.
కరువు ప్రకటన ఏదీ?
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కరువు మండలాల ప్రకటన చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువు పరిస్థితులను గుర్తించి తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రభుత్వం రైతుల పంటల బీమా ప్రీమియం చెల్లించేదని, ప్రస్తుతం ఆ బాధ్యతను రైతులపైనే ఉంచడంతో మరింత ఆర్థిక భారం పడుతోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే సాగు పెట్టుబడులకే ఇబ్బందులు పడుతున్న తమకు బీమా ప్రీమియం చెల్లించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు మండలాలను ప్రకటించి పంట నష్టపరిహారం, తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. అంబేడ్కర్ స్మృతి వనం, జిల్లా కలెక్టరేట్, రాఘవయ్య పార్క్‌లలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులు, యువతను పర్యాటక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కళారూపాల్లో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
24న ప్రతిభా ఎంపిక
సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ వస్త్రధారణ, ఇతర ప్రదర్శనల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం వద్ద నిర్వహించే ఎంపిక కార్యక్రమానికి హాజరై ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. ప్రతిభ చూపిన వారికి 27వ తేదీ నిర్వహించే ప్రధాన కార్యక్రమంలో ప్రదర్శనకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. పర్యాటక, చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ చిత్రాలు, కళాఖండాలు, సంప్రదాయ వస్తువులు, పర్యాటక సమాచారాన్ని క్యూఆర్ కోడ్‌లతో కూడిన స్టాళ్ల రూపంలో ప్రదర్శించేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, సంస్థలు పాల్గొనవచ్చని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా సంప్రదాయ ఆహార సంస్కృతిని ప్రోత్సహించే విధంగా సంప్రదాయ వంటకాల స్టాళ్లను ఏర్పాటు చేసి సందర్శకులకు పరిచయం చేసేందుకు ఆసక్తి ఉన్నవారు కూడా పాల్గొనవచ్చని జిల్లా పర్యాటక అధికారి కొల్లేటి రమేష్ తెలిపారు. పూర్తి వివరాలకు రమేష్ 94879 16504, భారతి 9849063213, మాధురి 9704466650 నంబర్లలో సంప్రదించాలని ప్రకటనలో కోరారు.
జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ర్యాలీ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, అధికారులు పాల్గొన్నారు.
వర్షాభావ పరిస్థితులు, మండుతున్న ఎండల కారణంగా పత్తి, మొక్క జొన్న పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. పూత, కాయ దశలో ఉన్న పత్తి చేలు నీరందక ఎండిపోతున్నాయి. పూత, కాయ రాలిపోవడంతో దిగుబడిపై ఆశలు సన్నగిల్లాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో తెగుళ్లు సోకడంతో రైతులు మరింత నష్టపోతున్నారు. మొక్కజొన్న పైరుకు సకాలంలో నీరందక నిట్టనిలువునా ఎండి పోయింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఏటిపట్టు గ్రామాల్లో వరి నారు మడులు సైతం వేయలేకపోవడంతో సాగుభూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. వర్షాలు లేక పొలాల్లో నెర్రెలు ఏర్పడ్డాయి. పంటలు దక్కకపోగా పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టగా, ప్రస్తుతం ఆ మొత్తం నష్టపోయే పరిస్థితి నెలకొంది.


