దుర్గగుడిలో ‘నకిలీ’ మకిలీ దర్శనాలు, ఆర్జిత సేవ టికెట్ల విక్రయాలు కావలి భక్తురాలికి దసరా ఆర్జిత సేవా టికెట్ ఐటీ విభాగాన్ని సంప్రదించిన భక్తురాలు సీపీకి ఫిర్యాదు చేసిన ఈవో
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని దుర్గగుడిలో దర్శనాలు, ఆర్జిత సేవల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ వ్యక్తుల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. దసరా మహోత్సవాల్లో శ్రీచక్ర నవార్చన సేవాటికెట్ ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి భక్తురాలి నుంచి రూ.3,500 వసూలు చేసి నకిలీ టికెట్ అందించిన ఘటన శనివారం వెలుగుచూసింది. కావలికి చెందిన ఓ భక్తురాలు దసరా ఉత్సాల్లో శ్రీచక్ర నవార్చన టికెట్ కోసం పరిచయస్తురాలి ద్వారా శర్మ అనే వ్యక్తిని సంప్రదించింది. తాను ఆలయంలో విధులు నిర్వహిస్తున్నానని నమ్మించిన సదరు వ్యక్తి రూ. 3500కు సేవా టికెట్‌ను విక్రయించారు. గతంలో ఉపయోగించిన పూజా టికెట్‌పై తేదీ వివరాలను మార్చి భక్తురాలికి పంపించాడు. అయితే సదరు భక్తురాలికి సేవా టికెట్‌పై అనుమానం రావడంతో ఆలయ ఐటీ విభాగాన్ని సంప్రదించింది. అసలు ఉత్సవాలకు సేవా టికెట్లను విడుదల చేయలేదని చెప్పడంతో తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవో శీనానాయక్.. సీపీ రాజశేఖరబాబుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
గతంలోనూ ఇదే తరహా మోసాలు
దుర్గగుడిలో గతంలోనూ కొందరు బయట వ్యక్తులు తాము ఆలయ సిబ్బంది, పూజారులు, అర్చకులమని భక్తులను నమ్మించి పూజల పేరుతో డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగు చూశాయి. కనకదుర్గ నగర్, ఆలయ ప్రాంగణంలోని కళావేదిక, రావిచెట్టు వద్ద అర్చకుల తరహాలో సంచరిస్తూ భక్తులతో మాటలు కలిపి వారిని మోసగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దసరా ఆర్జిత సేవా టికెట్లపై నకిలీల దృష్టి పడిది. తాజాగా దసరా ఆర్జిత సేవా టికెట్లకు ఉన్న డిమాండ్‌తో నకిలీ టికెట్‌ను విక్రయించి భక్తురాలిని మోసం చేయడంతో ఆలయంలో కలకలం చోటు చేసుకుంది. ఇప్పటికై నా అనధికార వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
నెలాఖరుకే ఆర్జిత సేవా టికెట్లు
దసరా ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లను నెలాఖరున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. గతంలో ఎదురైన అనుభవాలు, టికెట్ల గోల్‌మాల్, రీప్రింట్ వంటి వ్యవహారాలతో ఈ దఫా కట్టుదిట్టంగా ఆర్జిత సేవా టికెట్లను జారీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు తమకు కావాల్సిన ఆర్జిత సేవా టికెట్లను అధికారిక వెబ్‌సైట్, వాట్సాప్ మన మిత్ర, దేవస్థానం కౌంటర్లలోనే కొనుగోలు చేయాలని సూచించారు.


