దుర్గమ్మకు కానుకగా బంగారు గాజులు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు కానుకగా బంగారు గాజులు

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఆదివారం బంగారు గాజులను కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన ఎంపిడి కల్యాణి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణను కలిసిన దాతలు సుమారు 24 గ్రాముల బంగారంతో రూ. 3లక్షల వెచ్చించి తయారు చేయించిన గాజులను అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

వైభవంగా ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం

పెనుగంచిప్రోలు: నూతనంగా నిర్మించిన శ్రీఈశ్వరీదేవి అమ్మవారి ఆలయ, విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఆదివారం భక్త జన సందోహం మధ్య వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీవిశ్వజ్యోతిర్లింగ పీఠాధిపతి రామడుగు నరసింహాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు, హోమాలు పూర్ణాహుతితో ముగిశాయి. అమ్మవారి విగ్రహంతో పాటు కుమారస్వామి, వినాయకుడి విగ్రహాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రతిష్ఠా కార్యక్రమం అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించా. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి వేసవి శిక్షణ

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిమ్నాస్టిక్స్‌లో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ సోమవారం నుంచి జూన్‌ 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్‌ జిల్లా జిమ్నాస్టిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బి.బాబూరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏడు నుంచి 16 ఏళ్ల లోపు వయస్సు బాలబాలికలు ఈ కోచింగ్‌ క్యాంప్‌లో పాల్గొనవచ్చని, ఆటోనగర్‌ ఆర్టీసీ కాలనీలోని జేబీఎస్‌ విద్యాధర్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ ఆవరణలో ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. జిమ్నాస్టిక్స్‌లో జాతీయ స్థాయి క్రీడాకారులు ఎస్‌.ఐశ్వర్య, వి.నీలవేణి, ఎస్‌.కీర్తన ఈ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ శిక్షణలో పాల్గొంటారని వివరించారు.

సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

ఎ.కొండూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9న ఎ.కొండూరు మండలం మాధవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని, హెలీప్యాడ్‌ కోసం కేటాయించిన స్థలాన్ని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు రాజముద్రతో కూడిన సరికొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. సీఎం పర్యటనలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పర్యటనను దిగ్విజయం చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్‌తోపాటు జేసీ ఇలక్కియా, ఆర్డీవో ఎ.కుమార్‌, సీఐ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఆంధ్రప్రదేశ్‌ హియరింగ్‌ హ్యాండీ క్యాప్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీహెచ్‌హెచ్‌ఈఏ) నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ గాంధీనగర్‌లోని ఏపీ ఎన్జీఓ హోమ్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ హియరింగ్‌ హ్యాండీక్యాప్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీహెచ్‌హెచ్‌ఈఏ), అమరావతి నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడిగా వి.కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఎ.వెంకట్‌రెడ్డి, ప్రధానకార్యదర్శిగా ఎ.కన్నా, కోశాధికారిగా ఎస్కే ఇమామ్‌ ఖాసీం ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement