స్నాన ఘాట్, క్యూలైన్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, నీట్ పరీక్ష నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు, విద్యార్థులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనం రద్దు చేసి రూ.300 టికెట్‌పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. దీంతో ఉదయం 11గంటల కల్లా క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులందరికీ అమ్మవారి దర్శనం పూర్తయ్యింది. మరో వైపున అమ్మవారి మహా నివేదన నిమిత్తం మధ్యాహ్నం అన్ని దర్శనాలు నిలిపివేయడంతో క్యూలైన్లలో రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా, క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీతో ఘాట్‌రోడ్డులోని పార్కింగ్ ప్రదేశం పూర్తిగా వాహనాలతో నిండిపోవడంతో కార్లు ఇతర వాహనాలను కనకదుర్గనగర్‌కు మళ్లించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవల, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ..
సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆదివారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత దుర్గాఘాట్ స్నానాల రేవులో అపరిశుభ్రంగా ఉండటంతో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవులోని గట్టుపై మట్టి, వ్యర్థాలు నదిలో పడకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో భక్తులకు మజ్జిగ, మంచినీటితో పాటు చంటి పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.


