ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలి.. | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలి..

Mar 30 2026 7:21 AM | Updated on Mar 30 2026 7:21 AM

ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలి.. స్కానింగ్‌లు బయటకే.. నిలిచిన పంచకర్మ.. ఇవే నిదర్శనం..

మందులు, టెస్టులు అన్నీ బయటకే..

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

దూర ప్రాంతాల నుంచి

వచ్చిన రోగుల అవస్థలు

రాష్ట్రంలోని ఏకై క టీచింగ్‌ ఆయుర్వేద

ఆస్పత్రిపై సర్కారు సవతి ప్రేమ

లబ్బీపేట(విజయవాడతూర్పు): సంప్రదాయ దేశీయ వైద్యమైన ఆయుర్వేదంపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రాష్ట్రంలోనే ఏకై క ప్రభుత్వ టీచింగ్‌ ఆయుర్వేద ఆస్పత్రిగా ఉన్న విజయవాడలోని డాక్టర్‌ ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రి అరకొర సౌకర్యాలతో కునారిల్లుతోంది. దుష్ఫలితాలు లేని వైద్యమని ఆశతో వస్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. మందులు, రక్తపరీక్షలతో పాటు, ఫైల్స్‌, ఫిస్టులా వంటి వ్యాధులతో వచ్చే వారు దూది.. సూది కూడా బయట కొనుగోలు చేసి తీసుకు రావాల్సిన దయనీయ స్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో ఎలాంటి మందుల కొరత ఉండేది కాదు. కానీ నేడు వారి వద్ద ఉన్న వాటినే రోగులకు ఇచ్చి పంపుతున్నారు. లేనివి బయట కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నారు. డబ్బులు లేక ప్రభుత్వాస్పత్రికి వస్తే.. ఇక్కడ మందులు కూడా లేవంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చికిత్స కోసం వచ్చిన వారికి ఎవరికై నా అల్ట్రాసౌండ్‌, సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్‌లు అవసరమైతే ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికెళ్లి తీయించుకోమని చెప్పవచ్చు. కానీ కమీషన్‌ల కోసం కొందరు వైద్యులు ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌లకు రాస్తున్నారు. దీంతో ఆ స్లిప్పులు తీసుకుని అక్కడకు వెళితే రూ.వేలల్లో చెబుతున్నారని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని రకాల వ్యాధుల నిర్ధారణకు రక్తపరీక్షలు సైతం బయటకు రాస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యుల అత్యాశ వెరసి రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

గతంలో పంచకర్మ విభాగంలో అనేక రకాల చికిత్సలు అందించే వారు. ఊబకాయం, మైగ్రేన్‌, నడుము నొప్పి, మెడనొప్పిలతో పాటు, వివిధ రకాల చర్మ వ్యాధులకు చికిత్సలు చేసేవారు. ఇప్పుడు పంచకర్మ విభాగం దాదాపు మూలనపడింది. అరకొరగా సేవలు అందిస్తున్నారు. పంచకర్మ చికిత్సలు చేసేందుకు అవసరమైన తైలాలు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాకుండా నాల్గో తరగతి సిబ్బంది కొరత ఉండటంతో చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరుత్సాహంగా తిరిగి వెళ్తున్నారు.

ప్రజలకు విద్య, వైద్యం ఎంతో అవసరం. ప్రభుత్వాలు ఆ రెండు రంగాలను విస్మరించకూడదు. సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం పట్ల నిర్లక్ష్యం చేయడం తగదు. ఇక్కడ మంచి వైద్యం అందుతుందని దూర ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు. కానీ మందులు సరిగా ఇవ్వకుండా బయట కొనుక్కోమనడం, దూది కూడా లేక పోవడం దురదృష్టకరం. ప్రభుత్వం స్పందించి, సౌకర్యాలు కల్పించాలి.

– ఎండీ నాహిద్‌, లబ్బీపేట

విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన లక్ష్మీ నడుము నొప్పితో చికిత్స కోసం ఆయుర్వేద ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించి వైద్యులు ఆరు రకాల మందు లు రాశారు. చీటీ తీసుకుని ఫార్మసీ వద్దకు వెళ్లగా మూడు రకాలు చేతిలో పెట్టి, మిగిలినవి బయట కొనుక్కోమని ఉచిత సలహా ఇచ్చి పంపారు.

విజయవాడ గాంధీనగర్‌కు చెందిన వెంకటేశ్వరరావు ఫిస్టులా సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు రెండు రోజులకోసారి డ్రెస్సింగ్‌ చేయాల్సి వస్తోంది. ఆస్పత్రిలో స్టెరిలైజ్డ్‌ దూది లేక పోవడంతో బయట కొనుక్కొని తీసుకెళ్తున్నాడు. అంతేకాదు కుట్లు వేసేందుకు సూది కూడా లేని పరిస్థితి ఉంది.

ఇలా వీరిద్దరే కాదు ఆస్పత్రికి వచ్చే రోగుల్లో మూడొంతుల మంది సగం మందులు బయట కొనుగోలు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంటుంది. కూటమి ప్రభుత్వం ఆయుర్వేదంపై సవతిప్రేమ చూపుతోందని పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement