నందిగామ టౌన్: రంగు కలిపిన, నిల్వ చేసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే సహించేది లేదని ఉమ్మడి కృష్ణాజిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. నందిగామ పట్టణంలోని పలు హోటళ్లు, స్వీట్ దుకాణాల్లో ఆయన ఆదివారం విస్తృత తని ఖీలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్వీట్ షాపులు, హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరు ఆహార భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రామలింగేశ్వర స్వీటు దుకాణం, విజయ దుర్గ హోటల్‌లోని ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఫుడ్ లైసెన్స్, తదితర అనుమతి పత్రాలు ఉండాలని చెప్పారు. వేసవి కాలంలో కావటంతో నిల్వ ఉంచిన మాంసాహారాలు, ఆహార పదార్థాలు అందించటం వల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు. నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను గుర్తించి బయట పడేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రరెడ్డి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


