వెంకన్న దర్శనానికి భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

వెంకన్న దర్శనానికి భక్తుల రద్దీ

Mar 30 2026 7:23 AM | Updated on Mar 30 2026 7:23 AM

వెంకన్న దర్శనానికి భక్తుల రద్దీ లోక కల్యాణార్థం సూర్యోపాసన సేవ 10 ఎకరాల జామాయిల్‌ తోట దగ్ధం కృష్ణా జిల్లాలో పోలీసుల దాడులు

గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రులో వేంచే సిన భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (మెయిల్‌) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యా ణార్థం, సకల ప్రాణ కోటికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని కోరుతూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించి సూర్యనారాయణుడికి కేసరిని నివేదనగా సమర్పించారు. అనంతరం అందరికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ భక్తులకు ప్రసాద పంపిణీ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్‌ మార్గం ద్వారా అమ్మ వారి దర్శనానికి అనుమతించారు.

కంచికచర్ల: మండలంలోని కీసర సమీపంలో జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ భూమిలో ఉన్న 10 ఎకరాల జామాయిల్‌ తోటకు ఆదివారం రాత్రి నిప్పంటుని దగ్ధమైంది. ఆకతాయిలు నిప్పంటించారని స్థానికులు పేర్కొంటున్నారు. అగ్నిమాపక కేంద్ర సిబ్బంది సంఘట నా స్థలానికి చేరుకుని జామాయిల్‌తోటలో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. అప్పటికే పది ఎకరాల్లో ఉన్న జామాయిల్‌ తోట పూర్తిగా దగ్ధమైందని, రూ.11 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని ఫైర్‌ అధికారి శివారెడ్డి తెలిపారు.

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పోలీసులు పేకాట, కోడిపందేలు, క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులపై ఆదివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఒక్క రోజే 133 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌లను అరికట్టాలంటూ ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం జిల్లావ్యాప్తంగా ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న వారిని స్థానిక తహసీల్దారుల ఎదుట బైండోవర్‌ చేశారు. జిల్లాలో పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌లకు సంబంధించి ప్రజల వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందజేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement