పామర్రు: రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన పామర్రులో ఆదివారం జరిగింది. ఆరేపల్లి షణుఖ వెంకటేశ్వరరావు వేరే ఊరి నుంచి వస్తున్న తన బంధువుల కోసం పామర్రు – గుడివాడ రహదారిలోని ఫ్లై ఓవర్ వద్దకు బయలుదేరాడు. ఇంటి సమీపంలో నివసించే బావిశెట్టి జగదీష్(14)ను బైక్ ఎక్కించుకుని ఫ్లై ఓవర్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో గుడివాడ నుంచి వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న జగదీష్ రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన జగదీష్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. జగదీష్ పామర్రులో జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పామర్రు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


