నిబంధనలు పట్టించుకోకుండా..
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో అనుమతులు లేని కార్పొరేట్ విద్యాసంస్థలు భారీగా అడ్మిషన్లు చేపడుతుండగా, వాటిని అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందని విద్యావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపు చిన్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన నిబంధనలు అమలు చేస్తూ, మరోవైపు కార్పొరేట్ విద్యాసంస్థలకు సడలింపులు ఇస్తోంది. జిల్లాలో 196 ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే అధికారిక అనుమతులు ఉన్నాయి. కాగా కొత్తగా అనుమతులు లేని కొన్ని కార్పొరేట్ సంస్థలు టీడీపీ నేతలు అండతో నిర్భీతిగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి.
అనుమతులు లేకుండానే అడ్మిషన్లు..
జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్తగా ఎలాంటి ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నప్పటికీ, కొత్త కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడుతున్న పరిస్థితి తల్లిదండ్రుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. మచిలీపట్నం రూరల్ మండలంలోని ధర్మక్షేత్ర ఇంటర్నేషనల్ స్కూల్, గూడూరు మండలంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ వంటి సంస్థలు అనుమతులు లేకుండానే అడ్మిషన్లు ప్రారంభించాయి.
ప్రభుత్వ ఒత్తిడి..
ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే విద్యాధికారులు మౌనం వహిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విద్యావర్గాలు హెచ్చరిస్తున్నాయి.
‘సీబీఎస్‌ఈ’ పేరుతో ఆకర్షణ..
అనుమతులు లేకపోయినా ‘సీబీఎస్‌ఈ స్కూల్’ పేరు తో తల్లిదండ్రులను ఆకర్షిస్తూ యాజమాన్యాలు అడ్మి షన్లు చేపడుతున్నాయి. సీబీఎస్‌ఈ పాఠశాల అయినా జిల్లా విద్యాశాఖ నుంచి ఎన్‌ఓసీ తప్పనిసరి అనే నిబంధన ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి అనుమతులు పొందాలంటే 2025 డిసెంబర్ నాటికి ప్రభుత్వానికి చలాన్ చెల్లించి దరఖాస్తు చేయాలి. ఈ నిబంధనలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని కొన్ని కార్పొరేట్ యాజమాన్యాలు భవన నిర్మాణం పూర్తికాక ముందే అడ్మిషన్లు ప్రారంభించాయి. వాస్తవానికి పాఠశాలకు పూర్తి స్థాయి భవనం, తరగతి గదులు, బోధనా సిబ్బంది, క్రీడా మైదానం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. కానీ ఈ నిబంధనలను పక్కన పెట్టి భారీ ప్రచారం చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడుతున్నాయి.
‘సీబీఎస్‌ఈ’ పేరిట అడ్మిషన్ల దందా!
అనుమతులు లేకుండానే
దోపిడీకి శ్రీకారం
జిల్లా విద్యాశాఖ ఎన్‌ఓసీ
తప్పనిసరైనా పట్టించుకోని వైనం
పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు


