గుణదల(విజయవాడ తూర్పు): సర్వ మానవ పాప పరిహారార్థమై జనియించిన లోక రక్షకుడైన క్రీస్తును ప్రతి ఒక్కరూ విశ్వసించి కీర్తించాలని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు అన్నారు. పుణ్యక్షేత్ర ఆవరణలో మట్టల ఆదివారం సందర్భంగా ప్రత్యేక సమష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ మానవాళినీ సన్మార్గంలో నడిపించేందుకు ఏసుక్రీస్తు ప్రయత్నించారని, ఆయనను విశ్వసించి దేవుని నియమాలను పాటించిన వారికి శాంతి, సమాధానాలు లభిస్తాయన్నారు. మానవాళి రక్షణ కోసం ఏసుక్రీస్తు చేసిన సిలువ త్యాగాన్ని గుర్తించాలన్నారు. అనంతరం పుణ్యక్షేత్ర ప్రధానాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. అటుపై పుణ్యక్షేత్ర గురువులు, విశ్వాసులు మట్టలను చేతపట్టి గుణదల పుర వీధులలో పవిత్ర యాత్ర నిర్వహించారు. ఈత మట్టలు చేతపట్టుకొని హోసన్నా.. ఏసన్నా.. రాజుల రాజ నీకే జయం.. శాంతి ప్రదాత నీకే స్తోత్రం.. అంటూ నినాదాలు చేస్తూ క్రైస్తవ విశ్వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం ప్రార్థనలు


