పోలీస్ గ్రీవెన్స్‌కు 82 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్‌కు ప్రజల నుంచి 82 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎస్‌వీడీ ప్రసాద్, ఏడీసీపీ ఎం.రాజారావు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు, నడవలేని వారి వద్దకే వెళ్లి ఫిర్యాదులు అందుకుని, సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో పాటు, సత్వర పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా భూ వివాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించి 46, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 2, కొట్లాటకు సంబంధించి 2, వివిధ మోసాలపై 7, మహిళ సంబంధిత నేరాలపై 5, దొంగతనాలకు సంబంధించి 2, రోడ్డు ప్రమాదాలపై 1, ఇతర చిన్న వివాదాలపై 17 ఇలా మొత్తం 82 ఫిర్యాదులు ప్రజల నుంచి స్వీకరించారు.
అంబేడ్కర్ జీవితం ఆదర్శనీయం
డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దార్శనికత, జ్ఞానం, విద్య, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా కొనియాడారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం డీఆర్‌ఎం కార్యాలయ ప్రాంగణంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో రాజ్యాంగ విలువలను పాటించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, పలు బ్రాంచ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఖోఖో సంఘం రాష్ట్ర
అధ్యక్షుడిగా మడకా ప్రసాద్
గుడివాడరూరల్: ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గుడివాడకు చెందిన మడకా ప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన ఏలూరులో జరిగిన రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఎన్నికల్లో తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు. ఈ సందర్భంగా మడకా ప్రసాద్‌ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ రంగప్రసాద్, గౌతమ్ స్కూల్ డైరెక్టర్ కె.అవినాష్, ఖోఖో సంఘం జిల్లా సెక్రటరీ మద్దినేని సత్యప్రసాద్ అభినందించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 82 ఫిర్యాదులు


