శాతవాహన కళాశాల పరిరక్షణకు ఐక్య కార్యాచరణ
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): శాతవాహన కళాశాల పరిరక్షణకు విద్యార్థి సంఘాలు అన్ని కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించాలని అప్పుడే కళాశాలకు పూర్వ వైభవం వస్తోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర చెప్పారు. స్థానిక విశాలాంధ్ర రోడ్డులో శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం ఆ కళాశాల ఆవరణలోని మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు, విద్యార్థి సంఘాల కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించి చేసే కార్యక్రమాల్లో తమ సంఘం పూర్తి సహకారం అందిస్తోందన్నారు.
భవనాలను కూల్చడం అనాగరిక చర్య..
శాతవాహన కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సాంబిరెడ్డి మాట్లాడుతూ.. శాతవాహన కళాశాల ఐదు దశాబ్దాల పాటు వేల మందికి విద్యను అందించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దిందన్నారు. కళాశాల స్థలం విలువ కోట్ల రూపాయలకు పెరగడంతో కొంతమంది వ్యక్తులు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. శాతవాహన కళాశాల స్థలాన్ని దురాక్రమణదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవలసిన బాధ్యత శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘంపైనే ఉందన్నారు. ఇందుకోసం కోసం అన్ని విద్యార్థి సంఘాలతో పాటు పూర్వ విద్యార్థులు సంఘం సభ్యులు కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించాలన్నారు. దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధి పి.కృష్ణమోహన్ మాట్లాడుతూ శాతవాహన కళాశాల స్థలాలను పరిరక్షించుకుని కళాశాలను పూర్వస్థితికి తీసుకురావడానికి తమ సొసైటీ అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు నవనీతం సాంబశివరావు, సభ్యులు ఎం.రామకృష్ణ మాట్లాడుతూ కళాశాల భవనాలను కూల్చడం, క్రీడా మైదానాన్ని జేసీబీలతో తవ్వించడం వంటి దుశ్చర్యలు అనాగరికమన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులు రవి, కిరణ్, వెంకన్న, వాలేశ్వరరావు వల్లూరు బాబు, భాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర


