గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం
●షార్ట్‌సర్క్యూట్ కారణంగా
చెలరేగిన మంటలు
●రెండు షాపులు పూర్తిగా,
ఓ షాపు పాక్షికంగా దగ్ధం
● రూ.కోటి వరకు ఆస్తి నష్టం
గుడివాడరూరల్: పట్టణంలోని అద్దేపల్లి కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే పట్టణ నడిబొడ్డులోని నెహ్రూచౌక్ సమీపంలో ఉన్న అద్దేపల్లి కాంప్లెక్స్‌లో ఉన్న ఓ సెల్‌ఫోన్ షాప్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. సుమారు గంట తర్వాత సమీప ప్రజలు, ఉదయం వాకింగ్ చేసే వాకర్స్ మంటలు బయటకు కన్పించడంతో 5.15 గంటలకు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక అధికారి జక్కంపూడి ఆంజనేయులు నేతృత్వంలో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. గుడివాడకు ఒక ఫైర్ ఇంజన్ మాత్రమే ఉండటంతో వెంటనే కై కలూరు, ఉయ్యూరు ప్రాంతాల్లోని ఫైర్ ఇంజన్లు రప్పించి 20 మంది ఫైర్ సిబ్బందితో గుడివాడ, కై కలూరు ఫైర్ అధికారులు ఆంజనేయులు, క్రాంతికుమార్ నేతృత్వంలో మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, రెండు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయని, ఒక షాపు పాక్షికంగా దగ్ధమైనట్లు ఫైర్ అధికారులు తెలిపారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు గుర్తించారు.
పెరిగిన ప్రమాద తీవ్రత..
గుడివాడలో ఒక్క ఫైర్ ఇంజన్ ఉండడం.. ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చే సరికి ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి డి.ఏసురత్నం, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున నష్టపోయిన బాధితులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదే కాంప్లెక్స్‌లో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల, ఎస్‌బీఐ బ్రాంచ్‌తో పాటు మరికొన్ని షాపులు ఉన్నాయి. ఆదివారం కావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
గుడివాడ అద్దేపల్లి కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం


