22 నుంచి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు యోనెక్స్–సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌ను నిర్వహిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు తెలిపారు. నగరంలోని హోటల్‌లో బ్యాడ్మింటన్ పోటీలకు సంబంధించిన లోగో, పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ యువతలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
మరింత ఉత్సాహం..
ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ ఇలాంటి చాంపియన్‌షిప్‌లు క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ అంటే తెలుగువారే గుర్తుకు వస్తారన్నారు. 2029లో నేషనల్ గేమ్స్‌ను రాష్ట్రంలో నిర్వహించేలా ప్రయత్నిస్తున్నామని, అందుకు తగినట్లుగా మైదానాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మచౌదరి తదితరులు పాల్గొన్నారు.


