ప్రభుత్వ తీరుతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తం
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
తిరువూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విద్యారంగం అస్తవ్యస్తంగా మారిందని శాసనమండలి మాజీ సభ్యుడు కేఎస్ లక్ష్మణరావు విమర్శించారు. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని, గత రెండేళ్లలో పాఠశాలల్లో చేపట్టిన సంస్కరణల ఫలితంగా 4 లక్షల మంది పాఠశాల విద్యకు దూరమయ్యారన్నారు. 9 రకాల పాఠశాలల వర్గీకరణ కారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బడులు దూరమై చదువు మానేసే పరిస్థితి నెలకొందని, ఈ విధానాన్ని రద్దు చేస్తేనే ప్రభుత్వ పాఠశాలలు పునరుజ్జీవమవుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, వాటి నిర్వహణకు ఎటువంటి నిధులూ కేటాయించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, విద్యార్థులకు రావలసిన ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థుల ర్యాలీ
ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభల ప్రారంభ సందర్భంగా తిరువూరులో విద్యార్థులు ప్రదర్శన జరిపారు. ఫ్యాక్టరీ సెంటర్ నుంచి ప్రధాన రహదారిలో బోస్ సెంటర్ మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు మహాసభలకు విచ్చేశారు. శనివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు తెలిపారు.


