స్క్రబ్ టైఫస్‌పై ఆందోళన వద్దు
ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్క్రబ్ టైఫస్ వ్యాధి గురంచి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీని నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని పేర్కొన్నారు. ఇది కొత్త వ్యాధి ఏమీ కాదని తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న సందర్భంగా ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. స్క్రబ్ టైఫస్ కొత్తరకం జ్వరం కాదని, అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నిర్ధారణ కిట్‌లు, మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సుత్సుగమూషి అనే కీటకం కుట్టడం ద్వారా స్క్రబ్‌టైఫస్ వ్యాధి సోకుతుందని తెలి పారు. వ్యాధి సోకిన వారి శరీరంపై కీటకం కుట్టిన చోట ఎర్రటి మచ్చ ఉంటుందన్నారు. పొలాలు, తోటలు లేదా దట్టమైన వృక్షసంపద ఉన్న ప్రాంతాలను సందర్శించే వ్యక్తులను ఈ కీటకం కుట్టే ప్రమాదం ఉందన్నారు. కీటకం కుట్టకుడా పొడవు చేతుల చొక్కా, ఫ్యాంట్ ధరించాలని సూచించారు. జ్వరం వస్తే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకూ కేసులు నమోదు కాలేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టంచేశారు.


