జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకరన్ పేర్కొన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో కలిసి వైద్య–ఆరోగ్యం, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్‌పై ఆయా శాఖల అధికారులతో లంకా దినకర్ శనివారం సమీక్ష నిర్వహించారు. జననీ సురక్షా యోజన, జననీ శిశు సంరక్ష కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన తదితర పథకాలతో పాటు జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాలకు సంబంధించిన అంశాలపై సమీక్షించి, పురోగతికి అవసరమైన కార్యాచరణపై సూచ నలు చేశారు. బహుళ ప్రయోజనాల పీఎం సూర్యఘర్ పథకం అమల్లోనూ మరింత చొరవ చూపాలన్నారు. సమీక్షా సమావేశం అనంతరం లంకా దినకర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 100 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించడంపై అధికారులకు సూచనలు చేశామన్నారు. సిద్ధార్థ వైద్య కళాశాల అభివృద్ధి కార్యకలాపాలపైనా చర్చ జరిగిందన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, సీపీఓ వై.శ్రీలత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ ఎ.విద్యాసాగర్, విజయవాడ మునిసిపల్ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయ అధికారి డాక్టర్ జె.సుమన్ తదితరులు పాల్గొన్నారు.


