గొప్పల డప్పు.. రియల్‌కు ముప్పు
కొత్త ప్రాజెక్టులు రాకుండానే వచ్చేసినట్లు ప్రభుత్వ హడావుడి
ఫలితంగా విపరీతంగా పెరిగిపోయిన భూముల రేట్లు
హైవేల విస్తరణ పేరుతో హంగామా.. రైతుల్లో ఆందోళన
ప్రతిపాదనలు లేకుండానే హడావుడితో రియల్ వ్యాపారం కుదేలు
విజయవాడ – మచిలీపట్నం హైవేను 6 లైన్లకు విస్తరిస్తామని ప్రచారం
చినకాకాని సర్వీస్ రోడ్డు విస్తరణ హడావుడితో నిండా మునిగిన రియల్టర్లు
సాక్షి, అమరావతి: వీసమెత్తు అభివృద్ధి కనిపించకపోయినా ఎంతో జరిగిపోయినట్లు కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా గొప్పల డప్పు మోగిస్తోంది. ప్రభుత్వ హడావుడితో రైతులు అల్లాడుతుండగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. హైవేలు, పోర్టులు, రింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయని హడావుడి చేయడమే తప్ప వాస్తవంలో అవేమీ ఆచరణకు చోచుకోవడం లేదు. ప్రభుత్వం మాత్రం అవి వచ్చేసినట్లు, ఆ ప్రాంతాల రూపురేఖలు సమూలంగా మారిపోయినట్లు ప్రచారం చేస్తూ ప్రజలను మాయ చేస్తోంది. ఈ ప్రచారంతో రైతులు తమ భూములు విక్రయించాలో, వద్దో తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. భవిష్యత్‌లో భూములకు మంచి ధర వస్తుందని, ప్రస్తుతం ఉన్న రేట్లకు విక్రయిస్తే నష్టపోతామేమోననే భయం వారిని వెంటాడుతోంది. కొనుగోలుదారులు కూడా ఇప్పుడు భూములను కొంటే భూసేకరణ ఉచ్చులో చిక్కుకుంటామనే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. మరో వైపు ఆ ప్రాంతాల్లో అప్పటికే ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలు జరగక వెలవెలబోతు న్నాయి. ప్రభుత్వ తీరుతో అటు రైతులు, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిండా మునిగిపోయి ఆందోళన చెందుతున్నారు.
ప్రచారంతో రియల్ ఎస్టేట్ దివాలా
కూటమి ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు అత్యుత్సాహంతో చేస్తున్న ప్రకటనలు రియల్ ఎస్టేట్ రంగం కొంప ముంచుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం చెప్పేవన్నీ అమలు జరగడం సంగతి అటు ఉంచి, ఇప్పుడు ఎకరం భూమి ధర కోట్ల రూపాయలకు చేరడం, చదరపు గజం లక్షల రూపాయలు పలకడంతో అంతటా అయోమయం నెలకొంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తవుతుందని, దానికి ప్రధాన కనెక్టెవిటీగా ఉన్న మచిలీపట్నం – విజయవాడ హైవేను ఆరు లైన్లుగా విస్తరిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పోర్టు పూర్తయితే ఎంత ట్రాఫిక్ పెరుగుతుంది, దానికి ఎన్ని లైన్ల రోడ్డు కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించాలి, ఆరు లైన్లకు హైవే విస్తరణ అవసరమా అనే అంశాలపై స్పష్టత లేదు. అయినా విజయవాడ – మచిలీపట్నం రహదారిని ఆరు లైన్లుగా విస్తరిస్తారనే ప్రచారంతో ఆ ప్రాంతాల్లో భూముల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కానూరు, పెనుమలూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో కొద్దో గొప్పో జరిగే లావాదేవీలు కూడా ఇప్పడు భారీగా రేట్లు కారణంగా తగ్గిపోయాయి. ఎన్నికలకు ముందు గజం రూ.25 వేలు ఉన్న భూమి ఇప్పుడు రూ.50 వేలకుపైగా పెరిగిపోయింది. ఈడుపుగల్లు, గోసాల, వణుకూరు తదితర ప్రాంతాల్లో గతంలో రూ.10 వేలు ఉన్న గజం భూమి ధర ఇప్పుడు రూ.30 వేలకు పెరిగిపోయింది. దీంతో సామాన్యులు అటు వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండాపోయింది. ఉయ్యూరు, పామర్రు, నిమ్మకూరు తదితర ప్రాంతాల్లో రహదారి వెంబడి వెంచర్లు మొదలుపెట్టిన రియల్టర్లు కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ హడావుడితో ముందుకు వెళ్లలేక ఆగిపోయారు.


