తలనొప్పిగా వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్డు విస్తరణ ప్రచ
గుంటూరు జిల్లాలోని చినకాకాని వద్ద వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్డు విస్తరణ ప్రచారం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెద్ద దెబ్బ కొట్టింది. కాజ నుంచి విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద హైదరాబాద్ – మచిలీపట్నం హైవేకు అనుసంధానం చేస్తూ నిర్మించిన పశ్చిమ బైపాస్ రోడ్డుతో వాహనాల రద్దీ తగ్గుతుందని ప్రజలు భావించారు. అయితే సర్వీస్ రోడ్డు ప్రతిపాదన ఒక రూపు దాల్చకపోయినా రోడ్డు విస్తరణ ప్రచారం విపరీతంగా జరిగింది. అదిగో పులి అంటే, ఇదిగో తోక అన్న చందంగా ఇన్ని మీటర్లు, కాదు అన్ని మీటర్ల భూమిని ప్రభుత్వం సేకరిస్తుందంటూ లెక్కలు కట్టి మరీ కొందరు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సంబంధిత శాఖల్లో రోడ్డు విస్తరణ ప్రస్తావనే లేదు. అధికారులు సైతం తమకు ఈ విషయంలో అధికారి కంగా ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే భూ సేకరణపై దుష్ప్రచారం మాత్రం ఆగడం లేదు. అంతేకాకుండా మరి కొందరు ఫలానా సర్వే నంబర్లలో భూ రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసిందంటూ సరికొత్త ప్రచారానికి తెరతీశారు. పర్యవసానంగా మంచి ధరకు భూములు అమ్ముకుందామనుకుంటున్న రైతులు, ఇప్పటికే ఈ ప్రాంతంలో వెంచర్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. సర్వీస్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనకు ముందు కొందరు రియల్టర్లు రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేశారు. కొంత అమ్ముడైన తర్వాత రింగ్ రోడ్డు వస్తోందన్న ప్రచారం మొదలవడంతో మిగతా ప్లాట్ల విక్రయాలు నిలిచిపోయాయి. కొంత కాలంగా ఈ ప్రాంతంలో ఒక్క భూమి కూడా అమ్మకం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. భూసేకరణ ఎక్కడ జరుగుతుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వ్యాపారాలు స్తంభించిపోవడానికి కారణమవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ గందరగోళానికి తెర దించాలని రైతులు, రియల్ వ్యాపారులు కోరుతున్నారు.


