
గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్ట్ ప్రారంభం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్‌టీ సంస్కరణలతో ఎంఎస్‌ఎంఈల్లో నూతన ఉత్తేజం వచ్చిందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. భవానీపురంలోని పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జీఎస్‌టీ సంస్కరణలతో వాణిజ్య, వ్యాపార రంగాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయన్నారు. జిల్లాలో 67 శాతం వాటా కలిగిన సేవా రంగం మరింత అభివృద్ధికి జీఎస్‌టీ సంస్కరణలు దోహదం చేస్తాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఈ నెల 19 వరకు జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో రోజువారీ లక్కీ డ్రాలతో పాటు మెగా డ్రా తీస్తామని అన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయని చెప్పారు. స్థూల విలువ జోడింపు (జీవీఏ), తలసరి ఆదాయం పెరుగుదలకు జీఎస్‌టీ సంస్కరణలు ఉపయోగపడతాయని తెలిపారు. జీఎస్‌టీ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి రోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఫుడ్ స్టాల్స్, ఫన్ గేమ్స్ వంటివి ఉంటాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఆర్‌డీఓ ఎం.లక్ష్మీనరసింహం, వీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల అధికారి పి.మధు, డీఈఓ యూవీ సుబ్బారావు, ఎల్‌డీఎం కె.ప్రియాంక పాల్గొన్నారు.