
జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు బెదిరింపులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావును గుర్తు తెలియని అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. లయోలా కళాశాల సమీపంలో నివసించే ఆయన ఇంటికి మంగళవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లారు. మంగళవారం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మా క్యాంటీన్ లీజు ఒక ఏడాదే పొడిగించారు, రెండేళ్లు పొడిగించాలని డిమాండ్ చేశారు. నేను మూడు నెలల్లో రిటైర్ అవుతున్నానని చెప్పగా, అవన్నీ మాకు తెలియదు రేపు రెండేళ్లకు పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. అలాంటిది ఏమైనా ఉంటే ఆఫీసులో మాట్లాడదామని చెప్పినా వినకుండా బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఫోన్ తీసుకు వచ్చి ఫొటో తీద్దామని ఇంట్లోకి వెళ్లి రాగా, అప్పటికే వాళ్లు వెళ్లిపోయారు. ఈ విషయమై సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశకు సమాచారం ఇవ్వడంతో పాటు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్యాంటీన్ నిర్వాహకుల ఫిర్యాదు..
కాగా సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి బెదిరించిన వారితో తమకు సంబంధం లేదంటూ క్యాంటీన్ నిర్వాహకులు మాచవరం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. అగంతకులను గుర్తించాలని ఆ ఫిర్యాదులో కోరారు. క్యాంటీన్ లీజు ఏడాది పొడిగించారని, బెదిరించాల్సిన అవసరం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని కోరారు. అందుకు సంబంధించి అనుమానితుల పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
బెదిరింపులు దుర్మార్గం..
ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమని వైద్యుల సంఘం నేతలు డాక్టర్ సొంగా వినయ్‌కుమార్, డాక్టర్ కె.రవిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి వద్దకు వెళ్లిన అగంతకులు ఎవరో గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
గంజాయి నిందితుల అరెస్ట్
జి.కొండూరు: గంజాయి నిందితులను జి.కొండూరు పోలీసులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే... ఏలూరుకు చెందిన ఉత్తరవల్లి జగదీష్ అనే వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల పరిధి చెవుటూరు గ్రామ శివారులో ఎనిమిది మంది వ్యక్తులకు విక్రయించేందుకు ఏలూరు నుంచి గంజాయిని తీసుకువచ్చాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జి.కొండూరు ఎస్‌ఐ సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. గంజాయి విక్రయిస్తున్న జగదీష్‌తో పాటు కొనుగోలు చేసేందుకు ముందుగానే నిందితుడికి ఆన్‌లైన్ పేమెంట్ చేశారన్నారు. గంజాయిని తీసుకునేందుకు వచ్చిన మైలవరానికి చెందిన తమ్మిశెట్టి సాయి, విజయవాడకు చెందిన రామ్‌జలి కృష్ణ, బెజవాడ చందు, బొప్పూరి రవి, యలమర్తి కమలకేష్, జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన బొడ్డపాటి కార్తీక్, నూతక్కి ప్రసన్నకుమార్, చాట్ల విజ్ఞాన్ సాగర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 1.1 కేజీల గంజాయిని, రెండు స్కూటీలను, ఒక ఆటోని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు.
ఎంయూడీఏ వైస్ చైర్మన్‌గా జేసీ నవీన్
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంయూడీఏ) వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంయూడీఏ వైస్ చైర్మన్‌గా ఫుల్ అడిషనల్ చార్జ్‌ను నవీన్‌కు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.