
లారీల మధ్య ఇరుక్కుని లారీ డ్రైవర్ దుర్మరణం
జి.కొండూరు: రెండు లారీల మధ్య ప్రమాదవశాత్తూ ఇరుక్కుని లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన జి.కొండూరు బైపాస్‌రోడ్డులో బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులో ఒకే యజమానికి చెందిన రెండు లారీలు చత్తీస్‌ఘడ్‌లో అల్యూమినీయం రోల్స్‌ను లోడు చేసుకొని తమిళనాడు వెళ్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో జి.కొండూరు బైపాస్‌రోడ్డులోని ఆత్కూరు క్రాస్‌రోడ్డు జంక్షన్ వద్దకు రాగానే మలుపు తీసుకునే సమయంలో ముందు వస్తున్న లారీ ఇంజిన్ ఆగిపోయింది. ఆగిపోయిన లారీకి సెల్ఫ్ స్టార్ట్ లేకపోవడంతో వెనుక ఉన్న లారీతో ముందు లారీని నెట్టేందుకు ముందు లారీలో ఉన్న డ్రైవర్ సుభాష్(42) రెండు లారీల మధ్య ఇనుప రాడ్‌ను సెట్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఇనుప రాడ్డు పక్కకి తప్పడంతో వెనుక లారీ ఒక్కసారిగా ముందుకు రావడంతో రెండు లారీల మధ్యలో సుభాష్ ఇరుక్కుపోయాడు. సుభాష్ తల రెండు లారీల మధ్యలో ఒత్తుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సతీష్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి మృతుడు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.
కంచికచర్ల: రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు కంచికచర్లకు చెందిన కూరపాటి సరస్వతి(65) బుధవారం ఉదయం స్థానిక శ్రీశివసాయ క్షేత్రానికి వెళ్లి వచ్చే క్రమంలో నేషనల్ హైవే దాటుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనగా ఆమె తలకు తీవ్రగాయాలై, అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బందరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం
ఆటోనగర్(విజయవాడతూర్పు): పడవలరేవు సమీపంలోని బందరు కాలువ బ్రిడ్జి వద్దకు గుర్తు
తెలియని వ్యక్తి మృతదేహం బుధవారం కొట్టుకు వచ్చింది. మృతుడు సుమారు 45 ఏళ్ల మగ వ్యక్తిగా భావిస్తున్నారు. ఒంటిపై నిక్కర్ మాత్రమే ఉంది. బ్రిడ్జి పక్కనే ఉన్న చెట్లకు ఆనుకొని మృతదేహం ఆగింది.
కుటుంబ కలహాలతో అధ్యాపకుడు ఆత్మహత్య
పెనమలూరు: కుటుంబ కలహాలతో పోరంకిలో అధ్యాపకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన బాణావత్ హరిచంద్(37) ఓ ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. అతని భార్య అనిత పోరంకిలో ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. వీరు పోరంకిలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం అనిత సోదరుడు ఆర్థిక ఇబ్బందులతో ఉండటంతో రుణం కోసం బంగారు ఆభరణాలు ఇచ్చింది. అయితే అతను బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వలేదు. దీంతో దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. కాగా మంగళవారం అనిత సోదరుడు ఇంటికి రాగా హరిచంద్ బంగారు ఆభరణాల విషయం అడిగాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన హరిచంద్ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. భర్త గది నుంచి బయటకు రాక పోవటంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా హరిచంద్ ఫ్యాన్‌కు ఉరేసుకోని వేలాడుతూ కనిపించాడు. అతడిని వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రికి అత్యవసర చికిత్సకు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న హరిచంద్ ఆస్పత్రిలో బుధవారం వేకువజామున మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

లారీల మధ్య ఇరుక్కుని లారీ డ్రైవర్ దుర్మరణం

లారీల మధ్య ఇరుక్కుని లారీ డ్రైవర్ దుర్మరణం

లారీల మధ్య ఇరుక్కుని లారీ డ్రైవర్ దుర్మరణం