
నాట్యాచార్యుడు చినసత్యంకు నృత్య నీరాజనం
విజయవాడకల్చరల్: దుర్గాపురంలోని జీవీఆర్ సంగీత కళాశాలలో బుధవారం నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం జయంతి సందర్భంగా గోకరాజు గంగరాజు కళావేదికపై నిర్వహించిన నృత్య కార్యక్రమాలు మనోహరంగా సాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల వెంకటేశ్వరరావు నృత్య కళాశాల, అమరావతి నాట్యాచార్యుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. నగరానికి చెందిన 30 మంది నాట్యాచార్యులు తమ 500 మంది బృంద సభ్యులు నృత్యాంజలి ఘటించారు. చినసత్యం నృత్య దర్శకత్వం వహించిన బ్రహ్మాంజలి, జతిస్వరం, థిల్లానా అంశాలను ఒకే వేదికపై నృత్యాలను చేసి గురుభక్తిని చాటుకున్నారు.
తెలుగు తేజం చినసత్యం..
తెలుగు తేజం వెంపటి చినసత్యమని వైస్ ప్రిన్సిపాల్ కూచిపూడి కళాక్షేత్రం డాక్టర్ చింతారవి బాల కృష్ణ అన్నారు. నృత్య కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కూచిపూడి నాట్యరంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఆయన అనేక తెలుగు సినిమాల్లో పాటలకు నృత్య దర్శకత్వం వహించారని తెలిపారు. కూచిపూడి నాట్యానికి దిశానిర్దేశం చేశారన్నారు. నేడు ప్రముఖ నాట్యాచార్యులు ఆయన వద్ద నృత్యంలో శిక్షణ తీసుకున్నారన్నారు నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యాం ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్యోతిర్మయి పాల్గొన్నారు. పద్మశ్రీ హేమంత్, ఉమామహేశ్వర పాత్రుడు, సీహెచ్ అజయ్‌కుమార్, రాయన శ్రీనివాసరావు, సప్తా శివకుమార్, ఉషామాధవి, యల్లాజోస్యుల అనూరాధ, చదలవాడ ఆనంద్, హిమాన్సీ చౌదరి, లలిత, వేణుగోపాల్ తదితరులు తమ బృందాలతో నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు నాట్యాచార్యుడు వెంపటి చినసత్యానికి పుష్పాంజలి సమర్పించారు.