
టిడ్కో గృహాలకు నోటీసులు జారీ చేసిన బ్యాంక్ అధికారులు
మచిలీపట్నంటౌన్: స్థానిక రుద్రవరంలోని టిడ్కో గృహాల లబ్ధిదారులు బ్యాంక్‌కు రుణ వాయిదాలు(ఈఎంఐ)లు సక్రమంగా చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు బుధవారం పలువురు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి, ఇళ్లకు అతికించారు. కొంతమంది లబ్ధిదారులు రాజకీయ నాయకుల హామీలను నమ్మి, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే అపోహలో ఉండి ఈఎంఐ చెల్లింపులు నిలిపివేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇళ్లు కేటాయించి, నివాసం ఉండకపోవడం రుణ చెల్లింపులు నిలిపివేయడానికి సరైన కారణం కాదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం, టిడ్కో సంస్థ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించినట్లుగా, ఒకసారి ఇల్లు కేటాయించబడిన తరువాత ఇకపై ఎటువంటి ఆర్థిక సహాయం, రుణమాఫీ ఉండదని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్యాంకు అధికారులు రుద్రవరంలోని లబ్ధిదారులకు, ఈఎంఐలు తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశారు. ఆలస్యం జరిగితే ఖాతాలు ఎన్‌పీఏ స్థితిలోకి వెళ్లి సర్ఫేసీ(ఎస్‌ఎఆర్‌ఎఫ్‌ఎఈఎస్‌ఐ) చట్టం ప్రకారం నోటీసులు జారీ చేసి, అవసరమైతే ఇళ్లు వేలం వేస్తామని హెచ్చరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డెప్యూటీ రీజినల్ హెడ్ కొవ్వూరి రామలింగారెడ్డి, రికవరీ చీఫ్ మేనేజర్ రాకేష్, జిల్లా పరిషత్ బ్రాంచ్ మేనేజర్ నవక్రాంత్, సిబ్బంది పాల్గొన్నారు.