
18న క్లీన్ ఎయిర్ థీమ్‌తో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ నెల 18న స్వచ్ఛమైన గాలి(క్లీన్ ఎయిర్) ఇతివృత్తంతో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల విజయవంతానికి ప్రణాళికాయుత కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
పర్యావరణహిత దీపావళిని జరుపుకుందాం..
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంలోని 10 సూత్రాల్లో సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర అనేది ఒక సూత్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్‌తో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల క్లీన్ ఎయిర్ థీమ్‌తో కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. గాలి కాలుష్య కారకాలకు అడ్డుకట్ట వేస్తూ హరిత విస్తీర్ణం పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలిని ఐశ్వర్యంగా పొందవచ్చన్నారు. గాలి కాలుష్యం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థ, సౌర విద్యుత్ వినియోగం వంటి వాటిని ప్రోత్సహించాలన్నారు. నిత్య జీవిత ప్రయాణాన్ని పర్యావరణహిత మార్గంలో సాగించేలా అవగాహన కల్పించాలన్నారు. హానికర టపాసులు కాకుండా దీపాల కాంతులతో పర్యావరణహిత దీపావళిని జరుపుకుందామని సూచించారు. అధికారులు, సిబ్బంది కూడా ఇదే బాటలో నడిచి భావితరాలకు స్వచ్ఛమైన గాలి రూపంలో వెలకట్టలేని సంపదను బహుమతిగా అందించడంలో భాగస్వాములమవుదామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. సమావేశంలో డీపీవో పి.లావణ్యకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.