
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సకాలంలో చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ధాన్యం కొనుగోలు, సంబంధిత అంశాలపై జేసీ టెలీకాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. సమావేశంలో జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఏఎస్‌వోలు, సీఎస్ డీటీలు, ఏడీఏలు, ఎంఏవోలు, వీఏఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 3,03,154టన్నుల ధాన్యం సాగు చేసినట్లు పేర్కొన్నారు. అందులో 2లక్షల టన్నుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రాథమికంగా ఈనెల 20వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలానే ఆర్‌ఎస్‌కేలలో గోనె సంచుల ఏర్పాట్లు, మిల్లుల నుంచి బ్యాంక్ గ్యారంటీ సేకరణ వంటి అంశాలపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ–క్రాప్ నమోదు పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాలలో జీపీఎస్ వ్యవస్థాపనను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ అధికారులకు సూచించారు.
జాయింట్ కలెక్టర్ ఇలక్కియ