
సీఎం, డెప్యూటీ సీఎంలతో దిగిన ఫొటోలు చూపి మోసగించిన వైనం
సుమారు రూ.40 లక్షలు వసూలు పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ఎన్టీఆర్ జిల్లా: సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురి వద్ద భారీగా నగదు వసూలు చేసిన ఘరానా మోసగాడి ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. ఉద్యోగాలు అయినా ఇప్పించండి, నగదు అయినా ఇవ్వండి అని బాధితులు మోసగాడిని నిలదీయడంతో వారిపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించడంతో బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.... యూ ట్యూబర్ కావడి కృష్ణ గతంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నాడు.
ప్రస్తుతం అమరావతి సచివాలయం ప్రాంతంలో నివశిస్తున్నాడు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, పలువురు మంత్రులు, పోలీస్ అధికారులతో దిగిన ఫొటోలు, బొకేలు అందించే ఫొటోలు చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని 9 మందిని మాయలో పడేశాడు. వారి వద్ద సుమారు రూ.40 లక్షలు వరకు వసూలు చేశాడు. స్టేషన్‌కు వచ్చిన ఐదుగురి బాధితులు రూ.10.50 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నగదు అడుగుతుంటే నా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని బెదిరిస్తున్నట్లు వారు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.