మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి ఒకరోజు ఆదాయం రూ.8,26,626 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. శాశ్వత అన్నదాన కార్యక్రమం నిమిత్తం రూ.50,239, నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.50,712, కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 24,680, లడ్డూ, పులిహోర ద్వారా రూ. 1,12,225, దర్శన రుసుం ద్వారా రూ.63,100, సేవా టికెట్ల ద్వారా రూ. 5,18,380తో పాటు ఇతర సేవా టికెట్లతో కలిపి మొత్తం రూ.8,20,626 దేవస్థానానికి ఆదాయం వచ్చినట్లు వివరించారు.
కిక్కిరిసిన ఆలయం..
తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఆదివారం కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది.
పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో పలు పారామెడికల్ పోస్టుల కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని శ్రీనివాసరావు తెలిపారు. డెంటల్ మెకానిక్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20 సాయంత్రం 5 గంటల్లోపు కళాశాలలో అందజేయాలని సూచించారు. ఎంపికలు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలు, దరఖాస్తుకోసం http://gdchvja.inను సంప్రదించవచ్చునని సూచించారు.
పర్యాటకులతో
సాగరతీరం కళకళ
కోడూరు: హంసలదీవి సాగరతీరంలో పర్యాటకులతో కళకళలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులు ప్రత్యేక వాహనాల్లో తీరానికి తరలివచ్చారు. సముద్ర అలల మధ్య కేరింతలు కొడుతూ సరదాగా గడిపారు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, విజయవాడ, గుడివాడకు చెందిన పర్యాటకులు తీరంలో కనిపించారు. పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు ఏవిధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ చేపట్టారు.
తిరుపతమ్మకు
బంగారు కాసులపేరు
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారికి ఆదివారం బాపట్ల జిల్లా, రేపల్లె మండలం, నల్లూరిపాలెం గ్రామానికి చెందిన నలకుర్తి రాజేష్‌బాబు, లక్ష్మీతిరుపతమ్మ దంపతులు రూ.2లక్షలు విలువైన బంగారు కాసులపేరు ను ఆలయ ఇన్‌స్పెక్టర్ బద్దుల కృష్ణమోహన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు.
కుటుంబ సమేతంగా
చూడదగ్గ చిత్రం ‘కె–ర్యాంప్’
లబ్బీపేట(విజయవాడతూర్పు): కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం కె–ర్యాంప్ అని ఆ చిత్ర హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. దీపావళి కానుకగా ఈ నెల 18న విడుదల కానుండగా, చిత్ర పమోషన్‌లో భాగంగా కె–ర్యాంప్ యూనిట్ సభ్యులు ఆదివారం విజయవాడ విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. సినిమా మొత్తం ఆసక్తికరంగా ఉంటుందని, ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు. ఆదరించాలని కోరారు.
సుబ్బారాయుడికి రూ. 8.26లక్షల ఆదాయం
సుబ్బారాయుడికి రూ. 8.26లక్షల ఆదాయం