
దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటుకు వినతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగశయనం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దేవాంగ సామాజిక వర్గం ఎంతగానో కృషి చేసిందన్నారు. అటువంటి సామాజిక వర్గానికి వీలైనంత త్వరగా కార్పొరేషన్ ప్రకటించాలని కోరారు. చేనేతలకు పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. చేనేతలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం ప్రకటించిన ప్రభుత్వం తక్షణమే అమల్లోకి తేవాలన్నారు. దేవాంగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ మాట్లాడుతూ.. దేవాంగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్నారు. సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నక్కిన విజయ లక్ష్మి, జాతీయ దేవాంగ ఫెడరేషన్ ఏపీ మీడియా ఇన్‌చార్జి గుత్తి త్యాగరాజు, రాష్ట్ర కోశాధికారి ఉప్పు కనకరాజు, ఉపాధ్యక్షుడు మన్నెముద్దు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.