
విజయవాడ చరిత్రను ప్రపంచానికి తెలియజేద్దాం
హెరిటేజ్ వాక్ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడ చరిత్రను ఇక్కడి యువత తెలుసుకోవడంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రపంచానికి తెలిసేలా చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్‌టాచ్) ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ నగరంలో ఆదివారం జరిగింది. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియం వద్ద కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ఈ వాక్‌ను ప్రారంభించారు. అనంతరం మొగల్రాజపురం సిద్ధార్థ జంక్షన్‌లో ఉన్న గుహలను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారం ఇలాంటి వాక్‌లను నిర్వహించి యువతను ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాల్లో భాగం చేయాలన్నారు.
‘సిటీ ఆఫ్ కేవ్స్ అండ్ కెనాల్స్’ నినాదంతో..
చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ మొగల్ చక్రవర్తులు మచిలీపట్నం వెళ్తూ ఇక్కడ గుహలను నిర్మించారన్నారు. ఇన్‌టాచ్ సంస్థ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రపంచంలోని అతి పెద్ద వారసత్వ పరిరక్షక సంస్థల్లో ఒకటిగా ఉందన్నారు. ఇన్‌టాచ్ విజయవాడ కన్వీనర్ సాయి పాపినేని మాట్లాడుతూ ‘ది సిటీ ఆఫ్ కేవ్స్ అండ్ కెనాల్స్’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సిద్ధార్థ ఆడిటోరియం వద్ద మొదలైన వాక్ మధుచౌక్ దగ్గర ఉన్న నటరాజ స్వామి గుహల వరకు సాగింది. అక్కడ నుంచి వాహనాల్లో నగరంలోని గాంధీ హిల్, అక్కన్న మాదన్న గుహలు, ఉండవల్లిలోని గుహలతో పాటుగా ప్రకాశం బ్యారేజ్, బందరు, ఏలూరు కాలువలను సంస్థ సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు.