
తూర్పు కాపులందరికీ ఓబీసీ వర్తింపజేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మినహా అన్ని జిల్లాల్లో నివసిస్తున్న తూర్పు కాపులందరికీ ఓబీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్‌పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆలిండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రాంతం మారినంత మాత్రాన కులం మారదని, తూర్పు కాపులందరికీ ఓబీసీ రిజర్వేషన్ అమలయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో తూర్పు కాపులకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. అనంతరం ఆలిండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు జాయింట్ యాక్షన్ కమిటీలకు నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రమోహన్, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆకుల అప్పల సూరినాయుడు, జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా గిరడా అప్పలస్వామి ఎన్నికయ్యారు. 17 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను, రాష్ట్ర మహిళా విభాగాన్ని, యువజన విభాగాలను ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన మహంతి వాసుదేవరావును ఎన్నుకున్నారు. జాతీయ గౌరవాధ్యక్షుడు పి.గిరీశ్వరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆనెపు రామకృష్ణ, చంద్రరావు, ఉమామహేశ్వరరావు, బలగ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.