
అర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని సహించం
పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ లక్ష్మీశ గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ... పీజీఆర్‌ఎస్ అర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడాలని చెప్పారు. సరైన విధంగా ఎండార్స్‌మెంట్లు ఇవ్వాలని, అర్జీదారులతో అధికారుల ప్రవర్తన విషయంలో మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చేలా చిత్తశుద్ధి, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. మార్గదర్శకాలు పాటించడంలో ప్రవర్తన పరంగా కొందరు అధికారులలో లోపాలు కనిపిస్తున్నాయని.. వీటిని సరిదిద్దుకోవాలన్నారు. వీటిని సరిదిద్దుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల ఆడిటింగ్ సక్రమంగా పూర్తి చేయాలని, సమస్య పరిష్కార అధికారి (గ్రీవెన్స్ రెడ్రెస్సల్ అథారిటీ) స్వయంగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని చెప్పారు. అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి ఫీడ్ బ్యాక్‌ను నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారికి సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 153 అర్జీలు
జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 153 అర్జీలు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 52 అర్జీలు, విజయవాడ నగరపాలక సంస్థకు 19, పోలీస్ 18, డీఆర్‌డీఏ 10, పంచాయతీరాజ్ శాఖ 9, రవాణాశాఖకు 8, ఆరోగ్యశాఖకు ఏడు అర్జీలు వచ్చాయన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.