
వినాయక నిమజ్జనంలో కత్తులతో నృత్యాలు
వీరులపాడు: వినాయక నిమజ్జన కార్యక్రమంలో యువత మారణాయుధాలతో హల్‌చల్ చేయటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి వినాయకుని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో కొంతమంది యువత అత్యుత్సాహంతో పసుపు కండువాలు వేసుకుని డీజే సౌండ్స్, సినిమా పాటల మధ్య కత్తులు చేత పట్టుకుని నృత్యాలు చేయటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకునే యత్నం చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరా వృతం కాకుండా చూడాలని, భయానక వాతావరణాన్ని సృష్టించిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రమాదవశాత్తు నదిలో మునిగి యువకుడు మృతి
చల్లపల్లి: నదిలో నడిచి వస్తూ ప్రమాదవశాత్తు గోతిలో పడి ఓ యువకుడు నీటిలో మునిగిపోయి విగత జీవుడైన ఘటన మండల పరిధిలోని నిమ్మగడ్డ వద్ద కృష్ణానదిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పీఎస్‌వీ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం చల్లపల్లి మండలం పురిటిగడ్డ పంచాయతీ శివారు నిమ్మగడ్డ గ్రామానికి చెందిన మేడేపల్లి శ్రీనివాసరావు కుమారుడు మేడేపల్లి తేజబాబు(20) శనివారం ఉదయం కృష్ణానది మధ్యలో ఉన్న తమ లంక పొలాలకు నదిలో నీటిలో నడిచి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మరొక వ్యక్తితో కలిసి తిరిగి నదిలో నడుస్తూ వస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. ఎంతకీ పైకి తేలకపోవటంతో పక్కనున్న వ్యక్తి ఊళ్లో వారిని పిలుచుకొచ్చాడు. తేజబాబు మునిగిన చోట నీటి లోపల పెద్ద గుంట ఉండటంతో లోపల ఇరుక్కుపోయి ఉంటాడని గమనించిన స్థానికులు వలలు వేసి బయటకు తీయగా అప్పటికే అతను మృతిచెంది ఉన్నాడు. తేజాబాబు పాలిటెక్నిక్ డిప్లొమా చదివి ఇటీవలే అప్రెంటీస్ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఎస్‌ఐ పీఎస్‌వీ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.