
దేవాలయాల ద్వారాలు మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని జిల్లాలోని దేవాలయాల తలుపులను ఆయా ఆలయాల అధికారులు, అర్చకులు ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు, ఇతర వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఈవో శీనానాయక్ సమక్షంలో ఆలయ తలుపులు మూసివేశారు. అమ్మవారి ప్రధాన నివేదన శాలతో పాటు అన్నదానం, లడ్డూ పోటులోని ఆహార పదార్థాలు, సరుకులపై దర్భలను ఉంచామని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, నటరాజ స్వామి వారి ఆలయం, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం, కామథేను అమ్మవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. ఘాట్‌రోడ్డులోని ప్రధాన ద్వారాలను కూడా సెక్యూరిటీ సిబ్బంది మూసివేసి భక్తులెవరినీ కొండపైకి అనుమతించలేదు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఇంద్రకీలాద్రి పరిసరాలు గ్రహణం నేపథ్యంలో వెలవెలబోయాయి.
సంప్రోక్షణతో..
గ్రహణ అనంతరం సోమవారంతెల్లవారుజామున నదీ తీరం నుంచి జలాలను తీసుకువచ్చి సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
సుబ్బారాయుడి ఆలయంలో..
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేసేన సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం మద్యాహ్నం 12.30 గంటల నుంచి మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 10 గంటలకు మహా సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించబడుతుందని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు.
తిరుపతమ్మ ఆలయం..
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారి ఆలయ తలుపులను ఆదివారం ఉదయం 11 గంటలకు కవాటుబంధనం చేసి మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
చంద్రగ్రహణం నేపథ్యంలో
అర్చకుల చర్యలు

దేవాలయాల ద్వారాలు మూసివేత