
11న ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో ఉన్న బాల్సోత్సవ్ భవన్‌లో ఈ నెల 11వ తేదీన ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం బాలోత్సవ్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంపెడా కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఆక్వా ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు మొత్తం కొనుగోలు చేస్తామని భరోసా కల్పించాలని, అమెరికాతో చర్యలు జరపాలని, తక్కువ సుంకాలున్న అవసరమైన దేశాలకు ఎగుమతులు ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆంక్షలు తిప్పి కొట్టాలని, అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ఆక్వా రైతులు ఇతర పంటల రైతుల సహకారంతో ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంఘం ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు పాల్గొన్నారు.