
ముస్లింలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
గుణదల(విజయవాడ తూర్పు): ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనాలను ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ముస్లింలను నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ ఆరోపించారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అర్చకులకు, ఇమామ్‌లకు, పాస్టర్‌లకు గౌరవ వేతనాలను ఇచ్చేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యేడాది కాలంలో ముస్లింలకు గౌరవ వేతనం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి ముస్లింలకు ఇవ్వవలసిన గౌరవ వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింల తరఫున పోరాడేందుకు వైఎస్సార్ సీపీ ఎప్పుడు ముందడుగేస్తుందని భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు గౌరవ వేతనాలను విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.