
అరకొరగానే యూరియా
పెనమలూరు: మండల పరిధిలో ఆదివారం యూరియాను పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. రైతులు యూరియా పూర్తి స్థాయిలో అందుతుందని ఎదురు చూడగా అధికారులు కేవలం అరకొర యూరియా మాత్రమే రైతులకు అందజేశారు. దీంతో రైతులు అధికారుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వణుకూరులో వాగ్వాదం..
రైతులు చాలా కాలంగా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆదివారం వణుకూరు గ్రామానికి కేవలం 10 టన్నుల యూరియా పంపిణీ చేశారు. ఈ గ్రామంలో దాదాపు 1200 ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతుండగా కేవలం 10టున్నుల యూరియా మాత్రమే రైతులకు ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి వచ్చి యూరియా పంపిణీని పరిశీలించారు. యూరియా చాలినంత ఇవ్వక పోవటంపై రైతులు ఆమెను ప్రశ్నించారు. ప్రభుత్వం త్వరలో యూరియా సరఫరా చేస్తుందని ఆమె రైతులను నచ్చ చెప్పారు. రైతులు రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కట్టల కోసం పడిగాపులు కాశారు. రైతుకు గరిష్టంగా 3 బస్తాల యూరియా మాత్రమే ఇచ్చారు. రైతులకు తాగటానికి నీరు కూడా ఇవ్వలేదు.
● పెదపులిపాక సొసైటీలో కూడా 15 టన్నుల యూరియా అధికారులు పంపిణీ చేశారు. ఇక్కడ కూడా రైతులు యూరియా కోసం రాగా రైతులకు 3 బస్తాల యూరియా సీలింగ్ పెట్టడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల వ్యవసాయాధికారి కనకమేడల శైలజ, ఎంపీడీవో డాక్టర్ బండి ప్రణవి పాల్గొన్నారు.
అవసరం మేరకు సరఫరా చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని రైతులకు మొదటి ప్రాధాన్యతగా గుర్తించి అవసరం మేరకు ఎరువులను సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ అధికారులకు సూచించారు. ఆదివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహీర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు 12 వేల టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎన్. పద్మావతి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, వ్యవసాయశాఖ ఏడీ మణిధర్, ఆర్డీవో స్వాతి, ఏవో శాంతి పాల్గొన్నారు.
పామర్రు, గూడూరు మండలాల్లో పర్యటన..
గూడూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఆదివారం కృష్ణాజిల్లా పామర్రు మండలం జుఝ్జవరం, గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామాల్లో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలసి యూరియా పరిస్థితిపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఆయా గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో రైతులతో రాజశేఖర్ ముఖాముఖీ మాట్లాడారు.
పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ