
పోలీసుల దాడి హేయం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం.. చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ అన్నారు. నిర్బంధాలతో ఉద్యమాలను నిలువరించలేరన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. 14 నెలల కూటమి పాలనలో విద్యార్థుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని, ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. చలో విజయవాడకు పిలుపునిచ్చామని, విద్యాశాఖమంత్రికి విన్నవించుకునేందుకు వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేశారన్నారు. పోలీసుల దాడిలో కావ్య అనే విద్యార్థికి చెయ్యి విరిగిందని, ముగ్గురు విద్యార్థినులు స్పృహతప్పి పడిపోయా రని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్‌కు అర్థం అని ప్రశ్నించారు. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించడానికి ఎమ్మెల్యేలకు వినతులు ఇస్తామని, పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో అనేక ర్యాలీలకు అనుమతులు ఇస్తున్నారని, విద్యార్థులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. పొలిటికల్ అజెండాలకు అతీతంగా విద్యారంగ సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు చర్చించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నేతలు ఉష, మాధవ్, షణ్ముఖ్ జశ్వంత్ పాల్గొన్నారు.