
రోడ్డు ప్రమాదంలో విజయవాడ వాసి మృతి
శావల్యాపురం (పల్నాడు జిల్లా): రోడ్డు ప్రమాదంలో విజయవాడ వాసి మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. శావల్యాపురం ఎస్‌ఐ లేళ్ళ లోకేశ్వరరావు కథనం ప్రకారం... విజయవాడ చిట్టినగర్‌కు చెందిన తమ్మిన ప్రసాదు, కొలుసు అశోక్ స్కూటీపై శ్రీశైలంలో స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం గంటావారిపాలెం స్పీడు బ్రేకరు వద్ద అదుపు తప్పి పడిపోయింది. వాహనం నడుపుతున్న ప్రసాదు (33) రోడ్డుపై పడిపోవడం.. ఈ క్రమంలో పక్కనే టిప్పర్ రావడంతో ఘటనా స్థలంలో మృతి చెందాడు. స్కూటీపై వస్తున్న మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలించారు. ఇద్దరూ స్నేహితులు. కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.