
కట్టకటపై ఆగ్రహ జ్వాల
యూరియా కొరతపై నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు బాట
మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, నందిగామ ఆర్డీఓ కేంద్రాల వద్ద రైతులతో కలిసి నిరసన కార్యక్రమం రైతు సమస్యలపై కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించేలా పోరాటం ఇప్పటికే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ‘అన్నదాత పోరు’ పోస్టర్ల ఆవిష్కరణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఖరీఫ్ పంటలు సాగుచేస్తున్న రైతులను యూరియా కొరత వేధిస్తోంది. అదనుకొచ్చిన పంటకు బలం ఇవ్వకుంటే దిగుబడులు దిగజారుతాయన్న ఆందోళన అన్నదాతలను వేధిస్తోంది. మార్కెట్‌లో యూరియా దొరకడంలేదు. వచ్చిన కొద్ది సరుకును కొన్ని ప్రాంతాల్లో కూటమి పెద్దలు పక్కదారిపట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్ బోర్డు’లు దర్శనం ఇస్తున్నాయి. రైతులు తిండీతిప్పలు మానుకుని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద బారులు తీరుతున్నారు. యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. అన్నదాత పోరు పేరుతో మంగళవారం ఆర్డీఓ కేంద్రాల వద్ద రైతులు, రైతుసంఘాల నాయకులతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేయనుంది.
యూరియా కోసం రైతుల అవస్థలు
పైర్లను రక్షించుకునేందుకు అవసరమైన ఎరువుల కోసం రైతులు పీఏసీఎస్‌ల వద్ద బారులు తీరులు తీరి కనిసిస్తున్నారు. రాత్రిళ్లు సైతం నిద్రమానుకుని మరీ ప్రాథమిక సహకార సంఘాల వద్దే కాపు కాస్తున్నారు. యూరియా తీవ్రంగా కొరత ఉండటంతో రైతులు అర్ధరాత్రి రోడ్డెక్కి యూరియా లారీలను అడ్డుకొని, అందులో ఉన్న సరుకును తమకు పంచా లని ఆందోళనకు దిగుతున్నారు. గంపలగూడెం మండలంలో రైతులు గంటల తరబడి క్యూలో నిలబడలేక లైన్లలో చెప్పులు పెట్టి సమీపంలోని చెట్ల కింద తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఆదివారం కొత్తమాజేరు గ్రామంలో రైతులు క్యూలో నిలబడలేక సొమ్మసిల్లిపోయారు. అయినా ‘కట్ట’ యూరియా దొరకడం కష్టంగా మారింది. ఇప్పుడు వరి పంటకు యూరియా వేయకపోతే పిలకలు రావని, దిగుబడులు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నా కూటమి పెద్దల తీరులో మార్పు రావడంలేదు. యూరియాను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్తలు రైతులకు అండగా నిలిచారు. అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి యూరియా కొరతపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు లేదు. పంటలకు యూరియా, పురుగు మందులు ఎక్కువగా వినియోగించొద్దని, అవి వాడిన పంటలు తింటే క్యాన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కట్టకటపై ఆగ్రహ జ్వాల