
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. నందిగామలో ‘అన్నదాత పోరు’ను పోలీసులు అడ్డుకున్నారు. రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యానికి దిగారు. గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైఎస్సార్‌సీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నాఉ. నందిగామలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.
వైఎస్సార్‌సీపీ 'అన్నదాత పోరు'పై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నిరసనలు ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు. రైతులు, పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పోలీసులతో బెదిరింపుకు దిగుతూ.. నోటీసులు ఇస్తూ అరెస్టు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పదిమంది, 15 మందితోనే నిరసనలు చేయాలని ఆంక్షలు విధించింది.
ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని.. రైతులు, రైతు నేతలు స్పష్టం చేశారు. యూరియా కొరత, ఇతర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాల సమీప ప్రాంతాలకు చేరుకున్న రైతులు.. పోలీసులు, కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. చంద్రబాబు సర్కార్ విధించిన ఆంక్షలను చేధించుకుని రైతులు ఉద్యమిస్తున్నారు. యూరియా సరఫరాలో సీఎం చంద్రబాబు ఘెరంగా విఫలమయ్యారని... పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా ఆందోళన ఆపేది లేదని రైతులు అంటున్నారు.
ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు.. శాంతియుత ఆందోళనలకు తరలివస్తున్నాయి.
