
జిల్లాలో యూరియా కొరత లేదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతుల అవసరాలకు తగ్గట్లు ఎరువులు సరఫరా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సమీపంలోని సొసైటీలో అందుబాటులో ఉన్న ఎరువులు, వచ్చే వారం రోజుల్లో కొత్తగా వచ్చే ఎరువులు, పంట దశను బట్టి ఎరువుల మోతాదు తదితర అంశాలతో పాటు నానో యూరియా ప్రయోజనాలను కూడా ఇంటింటికీ వెళ్లి అధికారులు, సిబ్బంది వివరించినట్లు తెలిపారు. గతేడాది ఖరీఫ్‌తో పోల్చితే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి తగ్గట్లు యూరియాకు కూడా డిమాండ్ పెరిగిందని, ఇటీవల వర్షాలు కూడా బాగా పడటం వల్ల ఒక్కసారిగా డిమాండ్ అధికమైందని వివరించారు. ఎక్కువ మంది ఒకేసారి వచ్చిన సందర్భంలో రైతులు లైన్లలో ఉండి క్రమశిక్షణతో యూరియా తీసుకుంటున్నారని, అయితే ఆ ఫొటోల ఆధారంగా యూరియా లేదంటూ కొందరు వదంతులు సృష్టిస్తున్నారని, ఇది సరికాదన్నారు. ఎరువులకు సంబంధించి వాస్తవ సమాచారం కోసం రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే), పీఏసీఎస్‌లను సంప్రదించాలని, లేదంటే కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454) నంబరులో సంప్రదించాలన్నారు. ఒకవేళ ఎరువులు మార్గమధ్యంలో ఉంటే టోకెన్లు ఇచ్చి ఎరువులు చేరుకోగానే అందిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రకృతి సేద్యం ఉత్పత్తులు, సేంద్రియ ఎరువుల స్టాళ్లను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. రైతులతో ముచ్చటించి సాగు విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే ప్రకృతి సేద్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కలెక్టర్ జి.లక్ష్మీశ