
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా(పార్లమెంట్) జిల్లాకు చెందిన పలువురిని నియమించారు. విజయవాడ నగరానికి చెందిన అవుతు శ్రీనివాసరెడ్డికి నందిగామ, పెనమలూరు నియోజకవర్గాలను కేటాయిస్తూ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అలాగే తిరువూరు, మైలవరం నియోజకవర్గాలను తంగిరాల రామిరెడ్డికి, విజయవాడ వెస్ట్, జగ్గయ్యపేట నియోజకవర్గాలను ఆళ్ల చెల్లారావుకు, విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలను సర్నాల తిరుపతిరావుకు కేటాయించారు. అలాగే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు షేక్ సలార్‌దాదా, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాలకు మాదు శివరామకృష్ణ, పెడన, పామర్రు నియోజకవర్గాలకు అన్నే వేణుగోపాలకృష్ణమూర్తి (చిట్టిబాబు)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, అమ్మవారి సేవకులు పాల్గొన్నారు. ఆలయ ఘాట్‌రోడ్డు ప్రారంభంలోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించగా, మేళతాళాలు, మంగళవాయి ద్యాల నడుమ భక్తజనుల అమ్మవారి నామస్మరణ మధ్య ఊరేగింపు వైభవంగా ముందుకు సాగింది. ఘాట్‌రోడ్డు నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్ రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరింది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకుడు ఆర్. శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షించారు.
కోడూరు: ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని ఎరువుల, పురుగు మందుల షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ అధికారులు శనివారం రాత్రి ఈ తనిఖీలు జరిపారు. ఓ దుకాణంలో భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ చేసిన ఎరువులను అధికారులు గుర్తించారు. బిల్లు బుక్స్, స్టాక్ రిజిస్టర్, ఈ–పోస్ మిషన్‌లను పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న స్టాక్‌కు దుకాణంలో ఉన్న ఎరువుల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారించారు. దుకాణంలో రూ.2లక్షల విలువైన 13 టన్నుల ఎరువులకు ఏ విధమైన పత్రాలు లేనట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసినట్లు విజిలెన్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఒమర్ తెలిపారు. కాగా కోడూరు మండలంలో విజిలెన్స్ అధికారులు నెల వ్యవధిలో మూడు సార్లు ఎరువులు దుకాణాలపై దాడులు జరపడం గమనార్హం.
కోడూరు: హంసలదీవి సాగర తీరంలో పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహించారు. బీచ్ వద్ద సముద్రంలో గుంతలు ఏర్పడడంతో పర్యాటకులను అప్రమత్తం చేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులు తీరానికి తరలివచ్చారు. వీరంతా సముద్ర అలల మధ్య కేరింతలు కొడుతూ సందడి చేశారు. సముద్ర పరిస్థితులు భిన్నంగా ఉండడంతో మైరెన్ పోలీసులు లౌడ్‌స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ పర్యాటకులకు అవగాహన కల్పించారు. బీచ్ వద్ద నుంచి సాగరసంగమం వరకు గస్తీ చేపట్టారు. ఎస్‌ఐలు పూర్ణమాధురి, ఉజ్వల్‌కుమార్ పర్యవేక్షించారు.

వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం