
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఏఐ ఫర్ ష్యూర్(ఏఐ–4 ఎస్‌యూఆర్‌ఈ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహించుకుని ఆర్థిక ప్రగతి సాధించేందుకు అడుగులు ముందుకు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో శనివారం డీఆర్‌డీఏ, మెప్మా, యూసీడీ సంయుక్త ఆధ్వర్యంలో ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త – ఏఐ ఫర్ ష్యూర్ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌కు చేరువ చేసుకునేందుకు ఆధునిక సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఏఐ నిపుణులతో 160 మంది స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. నిట్ – వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ స్ఫూర్తి మాట్లాడుతూ రెండు సెషన్లలో ఆరుగంటల పాటు స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు ఏఐతో పాటు డిజిటల్ మార్కెటింగ్ వేదికలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకట నారాయణ, గ్రామీణ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కె.కల్పన, అర్బన్ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కె.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
ఏఐ ఫర్ ష్యూర్ శిక్షణ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ